కేంద్రం ఆంక్షలు రైతులకు గొడ్డలి పెట్టు: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

by  |
కేంద్రం ఆంక్షలు రైతులకు గొడ్డలి పెట్టు: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం అవగాహన లేకుండా పంటలు, ధాన్యం సేకరణపై పంచాయితీ పెడుతున్నదని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాదన అర్థరహితమని ఆయన సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. ధర్నాలు, పర్యటనలు కాకుండా రైతుల సమస్యను ప్రధాని మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. తెలంగాణలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల యాసంగిలో సీఎంఆర్ (Custom Milled Rice) బాయిల్డ్ రైస్​ను భారత ఆహార సంస్థ (food corporation of india)కి అప్పగిస్తున్నామన్నారు. దశాబ్దలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా యాసంగిలో 90 నుంచి 95 శాతం వరకు సీఎంఆర్ కింద బాయిల్డ్ రైస్ ను ఎఫ్​సీఐకి అప్పగించినట్లు గుర్తుచేశారు.

యాసంగి సీజన్ లో అధిక ఉష్ణోగ్రత వల్ల ‘రా’రైస్ (పచ్చిబియ్యం) ఉత్పత్తికి అనుకూలంగా ఉండదని, ధాన్యాన్ని రైస్​గా మార్చే క్రమంలో 30 నుంచి 40 శాతం వరకు నుకలు వస్తాయన్నారు. దీన్ని ఎఫ్​సీఐ అంగీకరించదన్నారు. అందుకే యాసంగిలో బాయిల్డ్ రైస్ ను ఇస్తున్నామని స్పష్టం చేశారు. కానీ ఇవన్నీ తెలుసుకోకుండా కేంద్రం పెట్టే ఆంక్షలు రైతులకు గొడ్డలిపెట్టుగా మారాయన్నారు. అయితే తెలంగాణ మినహా మరే రాష్ట్రం లోనూ పండిన పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం లేదన్నారు. కానీ కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి దాదాపు నెల నుంచి రెండు నెలల తర్వాత నిధులు వస్తున్నాయన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా మారుతోందని మండిపడ్డారు.



Next Story

Most Viewed