జాతీయ పక్షి చనిపోతే ఇంత నిర్లక్ష్యమా.. ?

by  |
జాతీయ పక్షి చనిపోతే ఇంత నిర్లక్ష్యమా.. ?
X

దిశ, చేవెళ్ల: మొయినా బాద్ మండలం కనకమామిడి గ్రామ పరిధిలోని వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌ కు జాతీయ పక్షి నెమలి షాక్ కు గురై మృతి చెందిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు అధికారులు ఎవరూ అక్కడికి చేరుకోకపోవడం పట్ల రైతు ఆలూరు రాములు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. వివరాలలోకి వెళితే.. మొయినా బాద్ మండలం కనకమామిడి గ్రామానికి చెందిన రైతు ఆలూరు రాములు వ్యవసాయ పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ కు షాక్ తగిలి నెమలి చనిపోగా ముగ్గురు రైతుల పొలాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది.

సోమవారం ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు రైతు రాములు వెళ్లగా పక్క రైతుల పొలాల్లో కరెంటు ఉండి తమ పొలంలో మోటర్ నడవకపోవడంతో అది గమనించిన రాములు ట్రాన్స్‌ఫార్మర్‌ వైపు చూడగా నెమలి చనిపోయి ఉంది. ఈ విషయాన్ని వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారులు ఎవరూ రాకపోవడంతో వరి నారుమడికి నీళ్ళు పార బెట్టలేక పోయానని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయాన్ని ట్రాన్స్కో ఏఈ తిరుపతి రెడ్డి దృష్టికి దిశ ప్రతినిధి తీసుకెళ్లగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటానని చెప్పారు. మొయినా బాద్ మండలం కనకమామిడి పశువైద్యాధికారి వెంకట్ యాదవ్ దృష్టి కి తీసుకెళ్లగా సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. జాతీయ పక్షి నెమలి విషయం అటవీశాఖ అధికారులు చూడాల్సి ఉంటుందని తెలిపారు.



Next Story