ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తున్న ముంబైకర్

by  |
Malvani
X

దిశ, ఫీచర్స్ : కరోనా వైరస్ రెండో దశ ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో సరిపడా ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో నిండుకుంటున్న ఆక్సిజన్ నిల్వలు ఊపిరాడకుండా చేస్తున్నాయి. గంటల వ్యవధిలోనే పరిస్థితి మారిపోతోంది. కేసుల సంఖ్యతో పాటు ఆక్సిజన్ అవసరం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుండగా.. కొవిడ్ తీవ్రరూపం దాల్చిన మహారాష్ట్రలో ఆక్సిజన్ అవసరం మరింత ఎక్కువగా ఉంది. దీంతో కేంద్రం తొలి ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు’ను అక్కడికి పంపించింది. అయితే ఇంతటి క్లిష్టపరిస్థితుల్లో ఒకే ఒక్కడు ‘ఆక్సిజన్ సిలిండర్ల’ను ఉచితంగా అందిస్తూ ముంబైలో ఎంతోమందికి లైఫ్ సేవర్‌గా మారాడు. గతేడాది కొవిడ్ టైమ్‌లో తన ఎస్‌యూవీ వాహనాన్ని విక్రయించి మరీ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన ఆ యువకుడే ‘షానవాజ్ షేక్’.

Shahnawaz Shaikh

మిస్టర్ షేక్.. తన ‘యూనిటీ & డిగ్నిటీ ఫౌండేషన్‌’తో ముంబై, మలాద్‌లోని మాల్వాని‌ పట్టణం‌లో హీరోగా మారాడు. ఒక్క ఫోన్ కాల్ ద్వారా రోగులకు ఆక్సిజన్ సరఫరా చేస్తూ, నిర్విరామంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ మేరకు వలంటీర్ల బృందంతో కలిసి పనిచేస్తున్న షానవాజ్.. వీలైనంత స్పీడ్‌గా బాధితులను ఆదుకునేందుకు ఓ ‘కంట్రోల్ రూమ్’ కూడా ఏర్పాటు చేశాడు. కొవిడ్ సంక్షోభంలో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాకు ఊహించనంత డిమాండ్ పెరిగిందని, 3 నెలల క్రితం ఆక్సిజన్ కోసం ప్రతిరోజు తనకు 50 కాల్స్ వస్తుండేవని తెలిపిన ఈ ముంబైకర్.. ప్రస్తుతం రోజుకు 500-600 వరకు ఫోన్ కాల్స్ వస్తున్నట్లు తెలిపాడు. కాగా తమ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు ఆరు వేల మందికిపైగా ఆక్సిజన్ సరఫరా చేసినట్టు ఆ యువకుడు వెల్లడించాడు. ఈ మేరకు షానవాజ్ అందిస్తు్న్న సేవల పట్ల కలెక్టర్లు, రాజకీయ నాయకులతో పాటు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు మాల్వానిలో తనను ఇప్పుడు ‘ఆక్సిజన్ మ్యాన్’‌గా పిలుస్తున్నారు.

‘నా స్నేహితుడి బంధువు ఒకరు కొవిడ్ -19 తో మరణించింది. సకాలంలో ఆక్సిజన్ అందితే ఆమె ప్రాణాలు నిలిచేవని నాకు తెలియగానే ఎంతో బాధేసింది. దాంతో నా కారును అమ్మేసి ఆక్సిజన్ అవసరమైనవారికి ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలోనే గతేడాది ‘యూనిటీ అండ్ డిగ్నిటీ ఫౌండేషన్’ ప్రారంభించాను. ఈ ఫౌండేషన్ ద్వారా పలువురికి మెడిసిన్స్ కూడా అందిస్తున్నాను’ అని షాహనావాజ్ పేర్కొన్నాడు.

Next Story

Most Viewed