కార్తీక స్నానం ఎప్పుడు చేయాలో తెలుసా ?

by  |
కార్తీక స్నానం ఎప్పుడు చేయాలో తెలుసా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రత్యేకమైన ఆచారం కార్తీక మాసానికి ఉంటుంది. ఈ మాసంలో నదీ స్నానం, శివారాధన, దీపారాధన-దీపదానం, విష్ణు ఆరాధన-పురాణ పఠనం లేదా శ్రవణం, దానములు చేయడం చాలా మంచిది. ఈ మాసంలో దీపాలు వెలిగించి శివ కేశవులను ఆరాధించి కార్తీక పురాణం ఎవరైతే చదువుతారో వారు చేసిన పాపాలు తొలగి, పుణ్యం కలిగి, జ్ఞానం సిద్ధించి, మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుందంటారు. ఇక ఈ మాసంలో తెల్లవారు జామున చల్లటి నీరుతో స్నానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయంటారు. కార్తిక మాసంలో రవి తుల రాశిలో ఉండటం వల్ల నదిలో నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం వల్ల మానవుడి శరీరానికి శక్తి కలిగి ఆరోగ్యసిద్ధి కలుగుతుంది. ఈ మాసంలో పుణ్య నదీ స్నానం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. అయితే శరత్‌రుతువులో చివరి భాగంలో వచ్చే కార్తీకంలో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. వర్ష రుతుప్రభావం కనుమరుగై శీతాకాలానికి మధ్య సంధికాలంగా ఉండే సమయం ఇది. ఈ కాలంలో మారిన, మారుతున్న వాతావారణ పరిస్థితులకు అనుగుణంగా శరీరాన్ని మలచడం కోసం పూర్వీకులు ఏర్పాటుచేసిన ఆచారం కార్తీకస్నానం.

నదుల్లో, సరస్సులు, పారే కాలువలు, జలపాతాలు, బావుల వద్ద స్నానం ఆచరిస్తే చాలా మంచిది. అయితే ఇది దైవభక్తే కాకుండా దీని వెనుక ఎన్నో ఆరోగ్య సూత్రాలు కూడా దాగి ఉన్నాయి. జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ నెలలో సూర్యుడు తులా రాశిలో వుంటాడు. సూర్యునికి ఇది నీచ స్థానం అవుతుంది. సూర్యుని ఉష్ణోగ్రత ఈ మాసం తక్కువగా వుంటుంది. చలికాలం ప్రారంభం అవుతుంది. ఇది మనిషి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. మన జీర్ణశక్తి తగ్గుతుంది. చురుకుతనం తగ్గుతుంది, బధ్ధకం పెరుగుతుంది. శరీరంలో నొప్పులు పెరుగుతాయి. నరాల బలహీనతవున్నవాళ్ళు చలికి ముడుచుకుని పడుకోవటంతో అవి ఇంకా పెరుగుతాయి. వీటన్నిటికీ దూరంగా వుండటం కోసమే మన ఆరోగ్య రక్షణకోసమే ఈ నియమాలు ఆచరించే పద్ధతిలో పెట్టారు.

కార్తీకమాసంలో సూర్యుడు ఉదయించక ముందే నక్షత్రాలు ఇంకా కనిపిస్తుండగానే కార్తీక మాసంలో భూమి నుంచి వెలువడిన జలాలతో స్నానం చేయాలన్నది పెద్దల నియమం. తెల్లవారు జామున లేవడం వలన ఈ కాలంలో సహజంగా వచ్చే రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చును. నక్షత్రాలుండగానే స్నానం, దైవపూజ, వగైరాల వలన బద్ధకం వదిలి శారీరకంగా ఉత్సాహంగా వుండటమే కాక మానసికంగా కూడా చాలా ఉల్లాసంగా వుంటుంది.

స్నానం ఎప్పుడు చేయాలంటే ?

ఉదయాన్నే 5.30 నిమిషాల లోపు నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేయాలి. మొదట మామూలుగా స్నానం ఆచరించి, తర్వాత పొడి వస్త్రం ధరించి సంకల్పం చెప్పుకొని రెండోసారి స్నానం ఆచరించాలి. శ్లోకం రానివారు, చదవలేనివారు భగవన్నామ స్మరణతో స్నానమాచరించాలి. ఇలా కార్తిక మాసం మొత్తం స్నానం ఆచరిచడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.



Next Story

Most Viewed