కోత జీతం.. జూలై తర్వాతే!

by  |
కోత జీతం.. జూలై తర్వాతే!
X

దిశ, న్యూస్ బ్యూరో: లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం సర్కారు ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించింది. దీంతో ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నెల వేతనమైనా పూర్తిగా వస్తుందా లేదా? అని అనుమానపడుతున్నారు. ఇప్పటికే ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తెలంగాణ ఉద్యోగుల్లో సైతం ఆశలు రేగాయి. ఇక ఇప్పటి వరకు కోత పెట్టిన వేతనాలను జూలై తర్వాత నెలకు కొంత చొప్పున సర్ధుబాటు చేసే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

సర్కారు కొలువు… ప్రతినెలా ఒకటో తారీఖున జీతం. ఇంకేం కావాలి… ఇది ప్రతినిత్యం వినిపించే మాటే. కానీ, ఇప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు వేతన గండం పట్టుకుంది. వరుసగా రెండు నెలలు సగం వేతనాలతో ఇబ్బందులకు గురయ్యారు. ఈ నెలైనా పూర్తి వేతనం అందుతుందా? లేదా? అనే సందిగ్ధంలో ఉన్నారు. కరోనా కష్టకాలంలో నిత్యావసర ధరలు మరింత పెరగడం, ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈఎంఐలు, నెలవారీ ఖర్చులు వెళ్లదీయడంలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ప్రస్తుత నెలకు పూర్తిస్థాయి వేతనాలు చెల్లిస్తామని ప్రకటించిన నేపథ్యంలో మన రాష్ట్రంలోనూ ఉద్యోగుల్లో ఆశలు మొదలయ్యాయి. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలపై సైతం ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ విధానాలపై ఎటూ మాట్లాడలేక… ఉద్యోగులకు చెప్పుకోలేక కొట్టుమిట్టాడుతున్న ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వ ప్రకటనతో సందిగ్థం మొదలైంది. కింది స్థాయి నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో ఇటీవలే నాయకులు ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు. దీనిపై సీఎస్‌ను కలిసి విన్నవించినా… సరైన సమాధానం రాలేదు. దీనిపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందోనని ఎదురుచూస్తున్నారు.

జూలై తర్వాతే..

లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటి నుంచి అత్యవసర విధుల్లో ఉన్న వారికి తప్ప ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాల్లొ కోత పెట్టారు. కాంట్రాక్ట్ సిబ్బందితో సహా ఆయా స్థాయిల్లో ఉన్న ఉద్యోగుల వేతనాల్లో 10 నుంచి 50 శాతం కోత విధించింది ప్రభుత్వం. ఈ కోత పెట్టిన వేతనాలను ప్రస్తుత నెలలో సర్దుబాటు చేస్తారని భావించారు. కానీ, ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపిస్తూ ప్రభుత్వం చెల్లింపులను మరో రెండు నెలలు వాయిదా వేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం. జూలై తర్వాతే కోత పెట్టిన వేతనాలను నెలకు కొంత మేరకు సర్దుబాటు చేస్తారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా బ్యాంకు ఈఎంఐలు, నెలవారీ ఇతరత్రా చెల్లించాల్సినవన్నీ తడిసిమోపడవుతాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

రూ.3500 కోట్లు అవసరం

ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల పూర్తి వేతనంతో పాటు కోత పెట్టిన వేతనాల చెల్లింపుల కోసం దాదాపు రూ.3500 కోట్లు అవసరమవుతాయని లెక్క కట్టారు. కనీసం ఈ నెలలో పూర్తిస్థాయి వేతనం చెల్లించాలంటే దాదాపు రూ.1200 కోట్లకుపైగా కావాల్సి ఉంది. ప్రస్తుతం మద్యం దుకాణాలు, ఆర్టీఏ, రిజిస్ట్రేషన్ నుంచి కొంత మేరకు ఆదాయం వస్తున్నా… అవి ప్రభుత్వానికి ఇతరత్రా ఖర్చులకు సర్దుకోవాల్సి వస్తుంది. మరోవైపు కేంద్రం నుంచి రూ.980 కోట్లు ఇటీవలే విడుదలయ్యాయి. వీటితో కలుపుకుని ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల పూర్తి వేతనం చెల్లిస్తే… ప్రభుత్వం వద్ద రూపాయి మిగిలే పరిస్థితి లేదని సమాచారం. దీంతో ఈ నెల సైతం సగం జీతాలే చెల్లించాల్సి వస్తుందా… అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈసారి కూడా సగం వేతనాలు చెల్లిస్తే… ఉద్యోగ సంఘాలపై దిగువ స్థాయి నుంచి తిరుగుబాటే ఎదురవుతుందనే చర్చ కొనసాగుతున్నది.

Next Story

Most Viewed