ఫారెస్ట్ ల్యాండ్‌లో రోడ్డు.. నిర్వాహకులపై చర్యలేవీ?

by  |
ఫారెస్ట్ ల్యాండ్‌లో రోడ్డు.. నిర్వాహకులపై చర్యలేవీ?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రజా అవసరాల కోసం కాకుండా వ్యాపారం కోసం దర్జాగా అటవీ భూమిని కబ్జా చేసిన వ్యవహారంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. అటవీ ప్రాంతంలో వంట చెరుకు తీసుకెళ్లినా సవాలక్ష కొర్రీలు పెట్టే అటవీ అధికారులు ఈ విషయంలో మాత్రం మొక్కుబడి చర్యలు మాత్రమే తీసుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

అటవీ భూమిలో రోడ్డు

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామం మీదుగా ఇసుక తరలించేందుకు ప్రభుత్వం క్వారీలకు అనుమతి ఇచ్చింది. ఇక్కడి నుంచి ప్రభుత్వ నిర్మాణాలకు అవసరమైన ఇసుకను తరలించేందుకు ప్రత్యేకంగా రోడ్డును కూడా వేశారు. అయితే ఈ క్వారీ నుంచి రహదారి ఏర్పాటు చేసుకునేందుకు రెవెన్యూ భూమి లేకపోవడంతో ఏకంగా అటవీ శాఖ భూమిలోంచి రోడ్డేశారు. నిత్యం వేలాది లారీలు ఈ రోడ్డు మీదుగా తరలి వెలుతున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఈ విషయాన్ని ‘దిశ’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో హుటాహుటిన అటవీ అధికారులు ఆ రోడ్డును మూసి వేస్తూ బారికేడ్‌లను ఏర్పాటు చేసి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ల్యాండ్ అని బోర్డు ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా అటవీ అధికారులు ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.

నిర్వాహకులపై చర్యలేవీ?

అటవీ ప్రాంతంలో రోడ్డు వేసి దర్జాగా క్వారీ నిర్వహించిందెవరు..? రోడ్డు ఎప్పుడు వేశారు? ఎన్ని లారీలు తిరిగాయి అన్న వివరాలపై విచారణ చేపట్టకపోవడం విస్మయం కల్గిస్తోంది. అంతేకాకుండా క్వారీ వల్ల జరిగిన నష్టాన్ని అంచానా వేసి సంబంధిత క్వారీ నిర్వహకులపై జరిమానా విధంచడంతో పాటు అటవీ శాఖ నిభందనలకు విరుద్దంగా రోడ్డు వేసినందుకు క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయలేదో అంతుచిక్కకుండా పోయింది. కేవలం రోడ్డు మూసి వేసి తమ పని పూర్తయిందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నట్లుగా ఉంది. మినరల్ డెవలప్ మెంట్ అధికారులను సంప్రదిస్తే అక్కడ క్వారీ నిర్వహించేందుకు ఏ ఏజెన్సీ లేదా ఏ వ్యక్తికి అప్పగించారో తెలుస్తుందన్నది వాస్తవం. లారీలపై కూడా అటవీశాఖ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తే వాటి నెంబర్లు కూడా టీఎస్ఎండీసీ కార్యాలయంలో రికార్డయి ఉంటాయి. వాటి నెంబర్ల ఆధారంగా అటవీ చట్టాలకు పనిచెప్పే అవకాశం ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నది ప్రశ్నగానే మిగిలింది.

నిర్లక్ష్యం ఎవరిది?

ఏళ్లుగా దర్జాగా సాగుతున్న ఈ క్వారీ కోసం వేసిన రోడ్డు విషయంలో ఇంతకాలం చూసీ చూడకుండా ఉండడానికి కారణం ఏంటీ.? అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా అధికారులు విస్మరించడం విడ్డూరంగా ఉంది. రోడ్డు వేసినప్పుడే అడ్డుకోవల్సిన బీట్ ఆఫీసర్ కానీ ఆపై అధికారులు కానీ ఇంతకాలం ఎందుకు పట్టించుకోలేదో అర్థం కావడం లేదు. ఫారెస్ట్ ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం కూడా విస్మయం కలిగిస్తోంది. అటవీశాఖ ఉన్నతాధికారులు ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story

Most Viewed