కాంగ్రెస్‌‌కు ‘డైవర్ట్ ఓటు’ గుబులు.. ఎమ్మెల్యేలు, మంత్రుల్లో హై టెన్షన్!

by Rajesh |
కాంగ్రెస్‌‌కు ‘డైవర్ట్ ఓటు’ గుబులు.. ఎమ్మెల్యేలు, మంత్రుల్లో హై టెన్షన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సరళి చూసిన తర్వాత కాంగ్రెస్ నాయకుల్లో గెలుపోటములు, మెజార్టీ అంశాలపై డిస్కస్ షురూ అయ్యింది. తమ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని వారు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోపల మాత్రం అన్ని సీట్లూ గెలుస్తామా? అనే గుబులు వారిని వెంటాడుతున్నది. అనేక నియోజకవర్గాల్లో బీజేపీ గట్టి పోటీ ఇవ్వడమే ఇందుకు కారణమనే టాక్ వారి నుంచి వినిపిస్తున్నది. మరోవైపు కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి డైవర్ట్ అయ్యిందనే ప్రచారం జరుగుతున్నదని, అదే జరిగితే తమ అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుందనే టెన్షన్‌ కాంగ్రెస్ లీడర్లను వెంటాడుతున్నది.

ఆరు గ్యారంటీలు వర్కవుట్ అయ్యాయా?

ఎన్నికల్లో సిక్స్ గ్యారంటీస్ అమలు తమకు పాజిటివ్ ఓటింగ్‌గా మారుతుందని కాంగ్రెస్ లీడర్లు గట్టి విశ్వాసంతో ఉన్నారు. అందుకే వంద రోజుల పాలనకు రెఫరెండం అని ప్రకటించారు. కానీ పోలింగ్ సరళి చూసిన తర్వాత ఆరు గ్యారంటీలు వర్క్ అవుట్ అయ్యాయా? అనే టెన్షన్ వారికి వెంటాడుతున్నట్టు తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పాజిటివ్ ఓటింగ్ వచ్చిన గ్రామాల్లో ఈసారి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ‘ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేశాం.. ఈ ఎన్నికల్లో బీజేపీకి వేశాం’ అనే తీరుగా ఓటింగ్ జరిగిందని మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అంతర్గత సమావేశాల్లో అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది.

సొంత సెగ్మెంట్లతో మెజార్టీ భయం

అసెంబ్లీ ఎలక్షన్‌లో వచ్చిన ఓట్ల కంటే ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు రావాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు పార్టీ అధిష్టానం టార్గెట్ పెట్టింది. ఒక వేళ తక్కువ వస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. పార్టీ అభ్యర్థి గెలవడంతో పాటు సొంత నియోజకవర్గా్ల్లో మెజార్టీ రావాలని ఎమ్మెల్యేలు, మంత్రులు అనుకున్నారు. కానీ పోలింగ్ సరళి చూసిన తర్వాత ఆశించిన స్థాయిలో మెజార్టీ వస్తుందా? లేదా? అనే ఆందోళన వారిలో నెలకొన్నది. ఒక వేళ ప్రతికూల ఫలితాలు వస్తే తమ రాజకీయ భవిష్యత్ ఏంటనే టెన్షన్ వారిని వెంటాడుతున్నట్టు తెలుస్తున్నది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి మినహా మిగతా మంత్రులందరినీ ఒక్కో ఎంపీ సెగ్మెంట్‌కు ఇన్‌చార్జిలుగా నియమించారు. వీరంతా పోలింగ్ ముగిసేంత వరకూ నియోజకవర్గంలోనే ఉండి ప్రచారం చేశారు. ఒక వేళ పార్టీ అభ్యర్థి గెలవకపోతే తమ పరిస్థితి ఏంటీ? అని మంత్రులు తమ సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తున్నది.

భయ పెడుతున్న డైవర్ట్ ఓటు

కొన్ని నియోజవర్గాల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి డైవర్ట్ అయినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా మహబూబ్‌నగర్, చేవెళ్ల, మెదక్, భువనగిరి, ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లలో ఆ పరిస్థితులు ఉన్నట్టు కాంగ్రెస్ అంచనా వేస్తున్నది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ లీడర్లే దగ్గరుండి మరీ తమ ఓటు బ్యాంకును బీజేపీకి డైవర్ట్ చేశారని ప్రచారం ఉన్నది. ఒకవేళ గంపగుత్తగా బీఆర్ఎస్ ఓటు కమలం గుర్తుకు డైవర్ట్ అయితే తమకు నష్టమని కాంగ్రెస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు.

సీఎం రేవంత్ రివ్యూ

పార్లమెంట్ ఓటింగ్ సరళిపై అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, అభ్యర్థులు, లీడర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అన్ని చోట్లా పరిస్థితి ఎలా ఉన్నదనే విషయాలను ఆరా తీశారు. ఈసారి కాంగ్రెస్ ఓట్ల శాతం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే మండలాల వారిగా పోలింగ్ సరళిపై లీడర్ల నుంచి సీఎం రిపోర్టు అడిగినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్‌కు ఎన్ని.. బీజేపీకి ఎన్ని ఓట్లు పడ్డయో అంచనాలతో సహా రిపోర్టు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. దాని అధారంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఎంత మెజార్టీతో విజయం సాధిస్తారనే విషయంపై క్లారిటీ వస్తుందని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది.

Next Story

Most Viewed