ప్రముఖులను విషాదంలోకి నెట్టిన ప్రమాదాలు.. తాజా ఘటనతో మరోమారు ఉలికిపాటు

by  |
ప్రముఖులను విషాదంలోకి నెట్టిన ప్రమాదాలు.. తాజా ఘటనతో మరోమారు ఉలికిపాటు
X

దిశ, శేరిలింగంపల్లి: నగరంలో తరచూ చోటు చేసుకుంటున్న ఘోర రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ యాక్సిడెంట్లు సామాన్యులతోపాటు ప్రముఖుల కుటుంబాల్లోనూ విషాదాల్ని నింపుతున్నాయి. ప్రస్తుతం నగర రోడ్లపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటి నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి.. తిరిగి వచ్చే వరకు నమ్మకం లేకుండా పోతోంది. అతివేగం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుంటే, వారి తప్పులేకుండానే ఎదుటివారి నిర్లక్ష్యానికి మరికొందరు బలవుతున్నారు. ఇక స్పోర్ట్స్ బైక్ లు, ఇంపోర్టెడ్ బైక్ లు, ఖరీదైన కార్లలో దూసుకుపోతూ సెలబ్రెటీల పిల్లలు దుర్మరణం చెందిన ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా సినీ హీరో సాయిధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో స్పోర్ట్స్ బైక్ లు, ఖరీదైన కార్ల యాక్సిడెంట్లు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

మరోమారు ఉలిక్కిపడ్డ సినీ ఇండస్ట్రీ..

స్పోర్ట్స్ బైక్ పై వెళుతున్న హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రాయదుర్గం కేబుల్ బ్రిడ్జీపై యాక్సిడెంట్ కు గురయ్యాడు. ప్రమాదవశాత్తు బైక్ స్కిడ్ అవడంతో ఒక్కసారిగా క్రింద పడిపోయాడు. దీంతో కుడికన్ను, ఛాతీ, పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయిధరమ్ తేజ్ బండి నెంబర్ టీఎస్ 07 జీజే 1258. ఈ బైక్ ఖరీదు రూ.18లక్షలు. అనిల్ కుమార్ పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఈ స్పోర్ట్స్ బైక్ 1160 సీసీతో నడిచే ట్రంఫ్ బైక్. ఇది సరికొత్త హై ఎండ్ బైక్ అని చెప్పాలి. ఇలా స్పోర్ట్స్ బైక్ లు ప్రమాదాలకు గురవడం, పలువురు సెలబ్రెటీల పిల్లలు గాయాలపాలవ్వడం, ప్రాణాలు పోగొట్టుకోవడం సాధారణంగా మారింది.

బైక్ ప్రమాదంలో బాబు మోహన్ కొడుకు దుర్మరణం..

Babu Mohan Family Rare and Unseen Images - YouTube

ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నేత బాబు మోహన్ కుమారుడు పి.పవన్ కుమార్(26) కూడా నగరంలో అక్టోబర్ 12, 2003లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. స్పోర్ట్స్ బైక్ పై వేగంగా ఇంటికి వెళుతున్న సమయంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ కు ఢీ కొట్టడంతో వపన్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పవన్ మృతితో బాబు మోహన్ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

కోట శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం..

బాబూ మోహన్ కుమారుడి మాదిరిగానే విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు కుమారుడు సైతం రోడ్డు యాక్సిడెంట్ లోనే మృత్యువాత పడ్డారు. జూన్ 20, 2010న జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో కోట కుమారుడు వెంకటసాయి ప్రసాద్‌(39) మృతి చెందాడు. తన స్పోర్ట్స్‌ బైక్ ‌పై శంషాబాద్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రసాద్‌ తన 1000 సీసీ స్పోర్ట్స్‌ బైకు(ఏపీ0938 డీఎక్స్‌-8474)పై ఒంటరిగా వెళుతున్నారు. అప్పా జంక్షన్ దర్గా మలుపు వద్ద ఓ డీసీఎం రింగురోడ్డుపైకి దూసుకొచ్చింది. బైక్ ‌పై వేగంగా వెళుతున్న ప్రసాద్‌ డీసీఎంను గమనించి హఠాత్తుగా బ్రేక్‌ వేయడంతో బైక్‌ రోడ్డును రాసుకుంటూ వెళ్లి డీసీఎం వ్యానును ఢీకొట్టింది. ఆయన తలకు తీవ్ర గాయాలై మరణించారు.

అజారుద్దీన్ కొడుకు ప్రాణం తీసిన రేసింగ్..

ఔటర్ రింగ్ రోడ్డుపై బైక్ రేసింగ్‌ లో పాల్గొన్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ కొడుకు మొహమ్మద్ అయాజుద్దీన్ బైక్‌ పై నుంచి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 17, 2011న మృతి చెందాడు. దీంతో అజారుద్దీన్ కుటుంబంలో తీరని శోకం మిగిలింది.

ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణ, జానకిరామ్..

బైక్ ప్రమాదాల్లోనే కాదు కారు యాక్సిడెంట్ లోనూ పలువురు ప్రముఖుల పిల్లలు మృత్యువాత పడ్డారు. సినీనటుడు, టీడీపీ నేత హరికృష్ణ కుమారుడు నందమూరి జానకిరామ్ కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్‌ 2014, డిసెంబర్‌ 6న నల్గొండ జిల్లా ఆకుపాముల వద్ద హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కుమారుడు మాదిరిగానే నల్లగొండ జిల్లాలోనే 29 ఆగస్టు 2019న జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో మాజీమంత్రి, సినీనటుడు హరికృష్ణ సైతం ప్రాణాలు కోల్పోయారు.

తృటిలో బయటపడ్డ జూనియర్ ఎన్టీఆర్..

ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా 2009 మార్చి 27న నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తృటిలో ప్రాణాపాయ స్థితిలో నుండి బయటపడ్డాడు. 2009 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించిన ఆయన ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న సఫారీ వాహనం ప్రమాదానికి గురయ్యిన సంగతి తెలిసిందే.

మాజీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ దుర్మరణం..

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లో మే 10 2017లో జరిగిన రోడ్డుప్రమాదంలో మాజీమంత్రి నారాయణ కుమారుడు నిశిత్‌ నారాయణ(22), అతడి స్నేహితుడు రవిచంద్ర మృతి చెందారు. వీరిద్దరూ ప్రయాణిస్తున్న బెంజ్‌ కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మృతి..

ఉమ్మడి మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు వద్ద డిసెంబర్ 20, 2011లో జరిగిన కారు ప్రమాదంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మృతిచెందారు.

ఇలా బైక్, కారు యాక్సిడెంట్లలో పలువురు సినీ రాజకీయ నాయకుల పిల్లలు మృత్యువాత పడ్డారు. అయినా ఖరీదైన స్పోర్ట్స్ బైక్ లు, కార్లలో ఓవర్ స్పీడ్ గా దూసుకెళ్లడం మాత్రం మానుకోలేక పోతున్నారు. తాజా ఘటనతో మరోమారు సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed