‘ఆ వార్తల్లో వాస్తవం లేదు‘

by  |
‘ఆ వార్తల్లో వాస్తవం లేదు‘
X

న్యూఢిల్లీ : దేశంలో వ్యాక్సిన్‌ల కొరత వేధిస్తుండగా కొత్త టీకాల కోసం ఆర్డర్లివ్వడం లేదనే వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని ఖండించింది. మార్చిలో ఇచ్చినవే తప్ప.. ఆ తర్వాత కొత్త వ్యాక్సిన్ డోసుల కోసం కేంద్రం వ్యాక్సిన్ తయారీ సంస్థలకు ఆర్డర్ ఇవ్వలేదని మీడియాలో పలు కథనాలు వెలువడ్డ తరుణంలో కేంద్రం స్పందించింది. గత నెల 28న వ్యాక్సిన్ల కోసం సీరం ఇనిస్టిట్యూట్‌‌కు 11 కోట్ల కొవిషీల్డ్ డోసుల ఆర్డర్లు ఇచ్చామని తెలిపింది. వీటిని ఈ నెలతో పాటు రాబోయే రెండు నెలల్లో వినియోగిస్తామని స్పష్టం చేసింది. ఇందుకోసం రూ. 1,732.50 కోట్లను విడుదల చేసిన ఆర్డర్ కాపీని విడుదల చేసింది. ఇదే సందర్భంలో భారత్ బయోటెక్‌కు ఐదు కోట్ల కొవాగ్జిన్ డోసుల కోసం రూ. 787.50 కోట్లు చెల్లించామని చెప్పుకొచ్చింది. మార్చిలో కొవిషీల్డ్ 10 కోట్ల డోసులు, కొవాగ్జిన్ 2 కోట్ల డోసుల కోసం ఇచ్చిన ఆర్డర్లే తప్ప కొత్త ఆర్డర్లు ఇవ్వలేదనే వార్తలు రావడంతో కేంద్రం పై విధంగా స్పందించింది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని స్పష్టతనిచ్చింది.

ఆదివారం నాటికి దేశంలోని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 16.54 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం తమ దగ్గర 78 లక్షలకు పైగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, మరో 56 లక్షల టీకాలు రాబోయే మూడు రోజుల్లో రానున్నాయని వివరించింది. ఇదే విషయమై సీరం కూడా స్పందించింది. ఏడాదికాలంగా తాము కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని, వ్యాక్సిన్ల ప్రక్రియ రాత్రికి రాత్రి జరిగే పని కాదని వివరణ ఇచ్చింది. కేంద్రం నుంచి ఇప్పటివ‌ర‌కూ తమకు 26 కోట్ల డోసుల ఆర్డర్లు అందాయని, వాటిలో 15 కోట్లు స‌ర‌ఫ‌రా చేయగా.. మ‌రో 11 కోట్ల డోసుల‌కు గాను రూ.1732.50 కోట్లు ఇప్పటికే చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపింది. వీటిని రాబోయే నెలల్లో సప్లై చేస్తామని వివరించింది.



Next Story

Most Viewed