త్వరలో రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది : పున్నం భిక్షపతి

by  |
త్వరలో రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది : పున్నం భిక్షపతి
X

దిశ, మణుగూరు : మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ముందు వరి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయడం లేదని టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేపట్టిన నిరసన ధర్నా హాస్యాస్పదంగా ఉందని భారతీయ జనతాపార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పున్నం భిక్షపతి ఎద్దేవా చేశారు. స్నేహగార్డెన్స్ లో పట్టణ అధ్యక్షుడు లింగంపల్లి రమేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన ధర్నా మండలంలో హాస్యాస్పదంగా మారిందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఎప్పుడైనా చెప్పిందా అని ప్రశ్నించారు. రైతులను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.

అయితే కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ ను(ఉప్పుడు బియ్యం) మిల్లులో ఆధునీకరించి యాసంగి వరి ధాన్యము రైస్ గా తయారు చేసి పంపించమని చెప్పారని వివరించారు. ఈ వంకతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. వరి వేస్తే ఉరే అని చెప్తూ.. రాష్ట్రంలో ధర్నాలు చేయడం ఎంతో బాధాకరమైన విషయమన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా బోనస్ ప్రకటించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేసీఆర్ ఇలాగే డబుల్ గేమ్స్ ఆడి రైతులను ప్రలోభాలకు గురి చేస్తే, త్వరలో రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని గుర్తు చేశారు.

Next Story

Most Viewed