ఇలా జరిగి ఉంటే ఫేస్‌బుక్ ఉండేది కాదు!

by  |
ఇలా జరిగి ఉంటే ఫేస్‌బుక్ ఉండేది కాదు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఫేస్‌బుక్ సృష్టికర్త మార్క్ జుకర్‌బర్గ్.. 2002లో ఒక చిన్న నిర్ణయం గనక అటు ఇటుగా తీసుకుని ఉంటే, ఇవాళ ఫేస్‌బుక్ ఉండేది కాదు. అవును.. అప్పట్లో మార్క్ కాలేజీకి వెళ్లడానికి ముందు వాళ్ల నాన్న ఒక ఆఫర్ ఇచ్చారట. హార్వర్డ్‌లో చదువు లేదంటే మెక్‌డొనాల్డ్స్ ఫ్రాంచైజీకి యాజమాన్యం అనే ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ మార్క్ జుకర్ బర్గ్ ఆ రోజున హార్వర్డ్ చదువు కాకుండా మెక్‌డొనాల్డ్స్ ఆఫర్ తీసుకుని ఉంటే ఇవాళ ఫేస్‌బుక్ ఉండేది కాదు. అయితే నిజానికి అప్పట్లో మెక్‌డొనాల్డ్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం అంటే జీవితానికి ఒక గొప్ప ఇన్సూరెన్స్ లాంటిది. కొన్నేళ్లపాటు స్థిరమైన ఆదాయం ఉండేది. ఇవాళ మెక్‌డొనాల్డ్స్ ఫ్రాంచైజీ నడుపుతున్నవారు సంవత్సరానికి 90 వేల డాలర్లు సంపాదిస్తున్నారు. కానీ మార్క్ జుకర్‌బర్గ్ ఆ ఆఫర్ తీసుకోకుండా నేడు ప్రపంచ సోషల్ మీడియాను శాసిస్తున్నాడు.

మార్క్‌తో పుట్టిన మరో ముగ్గురికి కూడా వారి తండ్రి ఇదే ఆఫర్‌ను ఇచ్చినట్లు మార్క్ సోదరి రాండీ జుకర్‌బర్గ్ తెలిపారు. సీఎన్‌బీసీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పటికే మార్క్ ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు ఎంతో గొప్పగా ఉండేవని, చిన్న చిన్న యాప్‌ల ద్వారా తమ తండ్రికి సహాయం చేసేవాడని, అందుకే అతని ప్రాజెక్టుల మీద ఉన్న నమ్మకంతో మార్క్ జుకర్‌బర్గ్.. హార్వర్డ్‌లో చదువును ఎంచుకున్నారని రాండీ చెప్పారు. ఈ రోజుల్లో యువత కూడా రిస్క్ తీసుకోకుండా సులభమైన మార్గాల్లో పనిచేస్తూ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనుకుంటారు. కానీ రిస్క్ తీసుకుని ధైర్యం చేయగలిగితే వారు ప్రపంచాన్ని శాసించే స్థాయికి కూడా ఎదగగలరని చెప్పడానికి మార్క్ జుకర్‌బర్గ్ నిర్ణయమే మరో నిదర్శనం.


Next Story

Most Viewed