కార్మికుల కోసం సినీ లోకం

by  |
కార్మికుల కోసం సినీ లోకం
X

దిశ, వెబ్‌డెస్క్: రీల్ హీరోలు .. రియల్ లైఫ్ హీరోలు అయ్యారు. కరోనా రక్కసి వల్ల ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల్లో కార్మికుల జీవితాలను నిలబెడుతున్నారు. టాలీవుడ్ పెద్దదిక్కు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసిన్ చారిటీ మనకోసం’కు విరాళాలు అందిస్తూ… పుట్టకూటి కోసం బాధపడుతున్న సినీ కార్మికుల కడుపు నింపుతున్నారు. ఇప్పటికే సిసిసి చారిటీకి చిరంజీవి, నాగార్జున, దగ్గుబాటి ఫ్యామిలీ రూ. కోటి చొప్పున విరాళం అందించగా… మహేష్ బాబు రూ. 25 లక్షలు, రామ్ చరణ్ రూ. 30 లక్షలు, ఎన్టీఆర్ రూ. 25 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. వీరి స్ఫూర్తితో మరింత మంది సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు.

అక్కినేని వారసుడు నాగచైతన్య తన వంతు సహకారం అందించేందుకు ముందుకొచ్చారు. ఈ సమయంలో కలిసి నడుద్దాం అని పిలుపునిచ్చారు. సినిమా కారణంగానే ఈ స్థాయిలో ఉన్నామని.. ఇప్పుడు సమాజానికి కొంత తిరిగిచ్చే అవకాశం వచ్చిందన్నారు. తోటి సినీ సోదరులు సినీ కార్మికులకు తమ మద్ధతు ఇచ్చారని… ఈ సమయంలో నా వంతు సహాయం ప్రకటించడం ఆనందంగా ఉందన్ననారు. ఈ క్రమంలోనే సిసిసి ఫండ్‌కు రూ. 25 లక్షల విరాళం ఇవ్వాలనుకుంటున్నానని తెలుపుతూ ట్వీట్ చేశారు చైతు.

ఆదివారం సోషల్ మీడియా ప్లాట్ పామ్ ట్విట్టర్‌లోకి ఎంటర్ అయిన శర్వానంద్ … కరోనాపై పోరాటంలో మనమంతా కలిసే ఉందామని పిలుపునిచ్చారు. కరోనా ఎఫెక్ట్‌తో సినీ కార్మికులు చాలా బాధపడుతున్నారని తెలిపారు. సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడే కార్మికులను ఇలాంటి కష్ట సమయంలో ఆదుకునేందుకు కరోనా క్రిసిస్ చారిటీకి రూ. 15 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని కోరిన శర్వా… ప్రభుత్వం సూచనలు పాటిస్తూ ప్రపంచానికే మహానుభావుడిగా నిలిచే అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

ప్రస్తుతం ప్రపంచం కోవిడ్ 19 వ్యాధి కారణంగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందన్నారు హీరో విశ్వక్ సేన్. దేశం కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలు అభినందించిన విశ్వక్ సేన్… తమ ఆరోగ్యం కన్నా కూడా దేశ భవిష్యత్తు ముఖ్యమనుకుని సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య, పోలీసు విభాగానికి ధన్యవాదాలు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా జీవన వ్యవస్థ స్తంభించి ఎదుటి వారి సాయం కోసం ఎదురుచూస్తున్న సినీ కార్మికులకు చేయూతనిచ్చేందుకు ముందకొచ్చారు. చిరు ఆధ్వర్యంలో ఏర్పడిన సిసిసి సంస్థకు రూ. 5 లక్షలు విరాళాన్ని ప్రకటించారు.

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చిరు, పవన్, చరణ్ భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించగా… ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఆర్థిక చేయూతనందించేందుకు కదిలివచ్చారు. ఇండస్ట్రీకి బ్యాక్ బోన్ అయిన సినీ కార్మికులకు మేమంతా మీకున్నామని చాటి చెప్పే సమయమిదన్నారు. వారి రక్షణ కోసం రూ. 20 లక్షలు కరోనా క్రిసిస్ చారిటీకి అందిస్తూ… కార్మికుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు కరోనా క్రిసిస్ చారిటీ ఏర్పాటును అభినందించారు. మన సినీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవడం బాధ్యతగా తీసుకుంటున్నామని… శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి రూ. 10 లక్షలు కరోనా క్రిసిస్ చారిటీ ఫండ్‌కు అందిస్తున్నామని ప్రకటించారు. కార్మికులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చిన సినీ తారలను అభినందించారు.

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.. అందమైన రూపమే కాదు అందమైన మనస్సు తనదని నిరూపించుకుంది. తన వంతు ప్రయత్నంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కార్మికులకు రూ. 1 లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించింది. సంపాదించిన దాంట్లో కొంచెమైనా దానం చేసేందుకు ముందుకొస్తారని ఆశిస్తున్నానని కోరింది.

మాస్ మహారాజా రవితేజ సినీ వర్కర్లకు చేయూతనివ్వడాన్ని ఒక బాధ్యతగా పరిగణిస్తున్నానని తెలిపారు. ఈ సహాయాన్ని బాధకు కొలమానంగా కాకుండా.. సినీ వర్కర్ల అవసరాలకు సహకారంగా భావించాలని కోరారు. తీసుకునే అంశం అనేది ఎప్పటికీ పూర్తికాదు… ఎంతోకొంత తిరిగి ఇచ్చేవరకు అన్న రవితేజ… తన తరపున రూ. 20 లక్షల సీసీసీ ఫండ్‌కు అందిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Next Story

Most Viewed