గొర్రెకు, బొప్పాయికి కరోనా.. ఎక్కడో తెలుసా..?

by  |
గొర్రెకు, బొప్పాయికి కరోనా.. ఎక్కడో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: అడవి జంతువుల నుంచి మనుషులకు కరోనా వైరస్ సంక్రమించిందని పరిశోధకులు ప్రాథమికంగా కనుగొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్న ఈ అంటువ్యాధి ఎక్కడా పెంపుడు జంతువులకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే తాజాగా ఒక గొర్రెపిల్లకే కాకుండా ఏకంగా బొప్పాయి పండుకు వచ్చినట్లు ఒక పరీక్షలో తేలింది. ఏంటీ ఇది నిజమా..? అని ఆశ్చర్యపోకండి. అది కోవిడ్-19 నిర్థారణ కిట్లను టెస్టింగ్‌లో భాగంగా జంతువులు, పండ్లపై వాడితే వచ్చిన ఫలితాలు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆఫ్రికా ఖండంలోని తూర్పు భాగంలో ఉన్న టాంజానియా దేశంలో కూడా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. వ్యాధి నిర్థారణకు కిట్స్ అవసరం కావడంతో పలు దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. అయితే దిగుమతి చేసుకున్న కిట్లను పరీక్షించేందుకు మనుషులతో పాటు గొర్రె, మేక, బొప్పాయి పండుపై పరీక్షించారు. ఈ పరీక్షలో గొర్రెకు, బొప్పాయి పండుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కాగా, మేకకు కరోనా లేనట్లు చూపించింది. దీంతో ఇవి నాసిరకం కిట్లని భావించి తిరిగి వెనక్కు పంపించారు. కాగా, ప్రభుత్వం ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై నాసిరకం కిట్లను కొనుగోలు చేసిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. వెంటనే రంగంలోకి దిగిన టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుఫులి దిద్దుబాటు చర్యలకు దిగారు. దిగుమతి చేసుకున్న కిట్లలో సాంకేతిక లోపాలున్నాయని వాటిని వెనక్కు పంపిస్తున్నామని వెల్లడించారు. అంతే కాకుండా దేశవ్యాప్తంగా ఈ కిట్ల వాడకాన్ని నిలిపేస్తున్నామని.. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తునకు ఆదేశించినట్లు మగుఫులి స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శల దాడిని పెంచాయి. వైరస్ వ్యాప్తిపై ఇప్పటికే పలు విషయాలను దాచి పెట్టిన ప్రభుత్వం.. నాసిరకం కిట్లతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయని దుయ్యబట్టాయి.

Tags : Covid 19, Coronavirus, Tanzania, John Magufuli, Testing Kits, Goat, Papaya, Positive

Next Story

Most Viewed