టీఆర్ఎస్, బీజేపీ నేతల్లో టెన్షన్

by  |
టీఆర్ఎస్, బీజేపీ నేతల్లో టెన్షన్
X

దిశ ప్రతినిధి, మెదక్ : దుబ్బాక ఉప పోరు పోలింగ్ మంగళవారం ముగిసింది. ఇక అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ గుబులు పట్టుకుంది. ప్రధాన పార్టీలన్నీ క్రాస్ ఓటింగ్ పైనే చర్చించుకుంటూ మస్తు టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తోంది. పోలింగ్‌కు ముందురోజు సిద్దిపేటలోని ఒక ప్యాలెస్‌లో టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పరం గొడవపడడం.. పోలింగ్ రోజు ఉదయం కొన్ని ప్రముఖ న్యూస్ ఛానళ్ల లోగోలతో మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ ముఖ్య నాయకులను కలిశారని, త్వరలోనే ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారని సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం.. ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ప్రచారానికి వచ్చిన తీన్మార్ మల్లన్నకు ఎన్నికల కోడ్ పేరుతో అనుమతి ఇవ్వకుండా, అదే సిద్దిపేటలోని ప్యాలెస్‌లో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల విషయంలో దుబ్బాక నియోజకవర్గం మినహా మిగతా ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ లేదని పోలీస్‌లు రెండు విధాలా వ్యవహరిస్తూ అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆయా పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేయడం.. బరిలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉండడంతో ఓట్లు చీలే అవకాశం ఉండడం.. ఇలాంటి ఘటనలు ఉప ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయోననే టెన్షన్ ఆయా పార్టీల అభ్యర్థుల్లో కనిపిస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 23 మంది ఉన్న విషయం తెలిసిందే. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఎక్కువగా ఉండటంతో క్రాస్ ఓటింగ్ చర్చ మొదలైంది. పోలింగ్ సమయంలో బీజేపీకి చెందిన నాయకులు సోషల్ మీడయాలో యాక్టివ్‌గా ఉంటూ మార్పు కోసం కమలం పువ్వుకు ఓటు వేయ్యాలంటూ ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమందితో మాట్లాడి పోలింగ్ పరిస్థితిపై సమీక్షించి, గాలంతా టీఆర్ఎస్ వైపే ఉందంటూ ప్రచారం చేసుకున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగానే బరిలో ఉండటంతో తమ ఖాతాలో పడే ఓట్లు వారు చీల్చారేమోననే సందేహం సైతం ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో నెలకొంది.

ఉలిక్కిపడ్డ కాంగ్రెస్..

పోలింగ్ సమయంలో తమ పార్టీకే ఓటు వేయ్యాలంటూ తమ చివరి ప్రయత్నంగా ఓటర్లను అభ్యర్థించాల్సిన సమయంలో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన వీడియో కాంగ్రెస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేసింది. పోలింగ్ మొదలైన కాసేపటికే ప్రముఖ న్యూస్ ఛానెళ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి మళ్లీ టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని, అందుకు సీఎం కేసీఆర్ అత్యంత సమీప బంధువును ఆయన కలసినట్టు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి స్పందించి పోలింగ్ సరళిని పరిశీలించడం మానేసి సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై చర్యలు తీసుకోవాలని, నిందితులను చట్ట ప్రకారం శిక్షించాలని తొగుట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా డీజీపీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి సైతం దీనిపై స్పందించారు. కాంగ్రెస్ గెలవడం ఖాయమని, దానిని జీర్ణించుకోలేకనే టీఆర్ఎస్, బీజేపీలు కలసి చేస్తున్న కుట్రగా వారు అభివర్ణించారు. దీని ప్రభావంతో తమకు రావాల్సిన ఓట్లు నష్టపోయే ప్రమాదముందని, ఎవరూ నమ్మవద్దని, కాంగ్రెస్ గెలుపు ఖాయమంటూ గాంభీర్యాన్ని ప్రదర్శించారు.

అక్కడ అలా.. ఇక్కడ ఇలా..

దుబ్బాక ఉప ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు కేవలం అధికార పార్టీకే వత్తాసు పలికారనేది స్థానికంగా చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలానికి వచ్చిన తీన్మార్ మల్లన్నను పోలీసులు అడ్డుకొని ఇక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, తమరు ఇక్కడ ఎలాంటి ప్రచారం నిర్వహించొద్దంటూ చెప్పారు. దీంతో మల్లన్న ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయారు. కానీ ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సిద్దిపేటలోని ఒక ప్యాలెస్‌లో బస చేశారు. తీన్మార్ మల్లన్నకు వర్తించిన రూల్ టీఆర్ఎస్ నాయకులకు వర్తించదా? అంటూ బీజేపీ నాయకులు ఆ ప్యాలెస్‌కు వెళ్లారు. వారితో వాగ్వాదానికి దిగారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ దుబ్బాకలో ఎన్నికలు జరుగుతున్నందున దుబ్బాక నియోజక‌వర్గంలో మినహా సిద్దిపేట జిల్లాలో ఎక్కడైనా ఉండొచ్చంటూ సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లోని ఒక ఉన్నతాధికారి చెప్పినట్లు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మొదట జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, జిల్లాకు చెందని వారెవరూ వుండొద్దని చెప్పిన పోలీసులు, ప్యాలెస్ గొడవలో మాట మార్చడమేంటని పలువురు ప్రశ్నించారు. అయితే ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులపై నెటిజన్లు విమర్శల వర్షం గుప్పించారు. ఇలాంటి ఘటనలు ఉప పోరు ఫలితాల్లో తమ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతావోనని ఆయా పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

Next Story