నేటి నుంచి మద్యం షాపులకు టెండర్లు

by  |
నేటి నుంచి మద్యం షాపులకు టెండర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ ప్రకారం టెండర్ల స్వీకరణ ఖరారైంది. మంగళవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అబ్కారీ శాఖ ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు చివర తేదీ కాగా.. 20న డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. ఎంపిక ప్రక్రియ ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో పూర్తి కానుంది. రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో భాగంగా ఈ కొత్త దుకాణాలు ఏర్పాటు అవుతాయని వివరించింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, గౌడ్ లకు మద్యం దుకాణాల కేటాయింపుల రిజర్వేషన్ల ప్రక్రియను అబ్కారీ శాఖ పూర్తి చేసింది. కమిటీ సభ్యులతో పాటు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారుల సమక్షంలో డ్రా ద్వారా గౌడ కులస్థులకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున దుకాణాలు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ మూడు కేటగిరీలకు కలిసి 756 మద్యం దుకాణాలు కేటాయించగా.. మిగిలిన 1,864 మద్యం దుకాణాలు ఓపెన్ కేటగిరీ కింద ఉన్నట్లు స్పష్టం చేసింది.

కొత్తగా 404 వైన్​ షాపులు

రాష్ట్రంలో మరో 404 కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న దుకాణాల్లో 15 శాతం అదనంగా అమ్మకాలు జరిగిన ప్రాంతాలతో పాటుగా కొత్త మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 2216 వైన్​షాపులు ఉండగా.. అదనంగా 404 పెరిగాయి. దీంతో ఇప్పుడున్న 2,216 దుకాణాలకు పెరిగిన 404 దుకాణాలతో కలిపి ఆ సంఖ్య 2,620కి పెరిగింది. నేటి నుంచి టెండర్లు స్వీకరించి, ఈ నెల 20న లాటరీ ద్వారా టెండర్లు ఖరారు చేసి దుకాణాలను అప్పగించనున్నారు. వచ్చేనెల 1 నుంచి కొత్త విధానంలో మద్యం షాపులు ఓపెన్​ కానున్నాయి. ఒక్కో టెండర్​ ఫారాన్ని రూ. 2 లక్షల చొప్పున విక్రయించనున్న విషయం తెలిసిందే. అప్లికేషన్​ ఫారాల ద్వారానే ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం రానుంది.


Next Story

Most Viewed