మహిళా వీవోఏ ఆత్మహత్య కేసులో పురోగతి.. వైసీపీ నేత అరెస్ట్

by Disha Web |
మహిళా వీవోఏ ఆత్మహత్య కేసులో పురోగతి.. వైసీపీ నేత అరెస్ట్
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కృష్ణా జిల్లా మచిలీపట్నం మండల వీవోఏల సంఘం నాయకురాలు నాగలక్ష్మి (42) ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నాగలక్ష్మి ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నేత నరసింహారావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నరసింహారావును పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. అనంతరం నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మరోవైపు ఆత్మహత్యకు ముందు నాగలక్ష్మి రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరసింహారావు వేధించడంతో అవమానంగా భావించిన నాగలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

అసలు జరిగింది ఇదే..

నాగలక్ష్మి ఆత్మహత్య కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. బందరు తాలూకా భోగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గరికిపాటి నాగలక్ష్మి-వీర కృష్ణ మోహన రావు భార్య భర్తలు. నాగలక్ష్మి గ్రామ సమాఖ్య సంఘంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఆమె ఆధీనంలోనే సుమారు 37 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. అయితే నాగలక్ష్మి పరిధిలోని భ్రమరాంబిక స్వయం సహాయక సంఘంలో గరికిపాటి నాగమణి అనే మహిళ సభ్యురాలిగా వుండేది. లోన్ మంజూరు విషయంలో నాగలక్ష్మి, నాగమణికి మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో నాగమణి భర్త నరసింహరావు పలుమార్లు నాగలక్ష్మితో గొడవపడి బూతులు తిడుతూ ఆమె గురించి అసత్య ప్రచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.

గత నెల ఫిబ్రవరి 23న వెలుగు ఆఫీసు సమావేశం జరుగుతుండగా నరసింహరావు అక్కడికి వచ్చి నాగలక్ష్మితో గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా దుర్భాషలాడుతూ దాడికి కూడా యత్నించినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. దీంతో నాగలక్ష్మి ఫిబ్రవరి 24న పోలీసులకు ఫిర్యాదు చేయగా నరసింహరావు, నాగమణి దంపతులను స్థానిక ఎస్ఐ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారని.. సదరు ముద్దాయిలు ఆమె జోలికి వెళ్ళను అని హమీ పత్రం రాసి ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు మార్చి 14న నాగలక్ష్మి కృష్ణా జిల్లా ఎస్పీకి సైతం ఈ అంశంపై ఫిర్యాదు చేసిందని తెలిపారు. వెంటనే నిందితులపై చర్య తీసుకోవాలని సీఐని ఎస్పీ ఆదేశించినట్లు తెలిపారు. సీఐ కూడా నాగలక్ష్మిని పిలిచి విచారించి అనంతరం ఫిర్యాదులో పేర్కొన్న వారిని కూడా పిలిచి విచారించినట్లు తెలిసిందన్నారు.

తర్వాత రోజు బందరు సీఐ ఆదేశాలతో ఎస్ఐ 16న సదరు ఫిర్యాదుపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారని.. బందరు రూరల్ స్టేషన్‌లో నాగలక్ష్మి ఫిర్యాదుపై Cr.No-105/2022 U/s 354 354 –A 506, 509 r/w 34 IPC కేసుగా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అదే రోజు సాయంత్రం నరసింహరావు దుర్భాషలాడుతూ తిట్టడంతో అవమానంగా భావించిన నాగలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడ్డ నాగలక్ష్మిని ఆమె కుమారుడు చిన్నాపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని పోలీసులు వెల్లడించారు. అక్కడ చికిత్స పొందుతూ 17న ఉదయం నాగలక్ష్మి చనిపోయిందని తెలిపారు.మృతురాలి కుమారుడు గరికిపాటి పార్ధ శివసాయి ఫిర్యాదుపై చిలకలపూడి పోలీసు స్టేషన్ Cr.No-63/2022 U/s 306 IPC కేసు నమోదుచేసి ముద్దాయి గరికిపాటి నరసింహరావుని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడిని శుక్రవారం జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు మచిలీపట్నం డిఎస్పీ షేక్ మాసూం భాష వెల్లడించారు.






Next Story

Most Viewed