బట్టీల్లోనే బలవుతున్న బాల్యం.. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి..!

by Disha Web Desk 19 |
బట్టీల్లోనే బలవుతున్న బాల్యం.. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి..!
X

దిశ, రామాయంపేట: మెదక్ జిల్లాలోని నిజాంపేట్, తూప్రాన్, చేగుంట మండలాల్లో అనుమతులు లేకున్నా ఇటుకబట్టీలు యథేచ్చగా నిర్వహిస్తున్నారు. ప్రకృతి సంపదను గుల్ల చేస్తున్నారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి చెల్లించకుండా అన్ని ఫ్రీగా వాడుకుంటున్నారు అక్రమార్కులు. మట్టి నుంచి మొదలుకుని కలప, కరెంట్ వరకు అన్ని వారికి ఉచితమే. అధికారులు ఒక్కసారి కూడా ఇటుక బట్టీలపై దాడులు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. అక్రమంగా వ్యాపారం చేస్తున్న వారికి అధికారుల నుంచి పూర్తి అండదండలు ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఇటుక బట్టీలు నిర్వహించే వారు దర్జాగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. బట్టీలలో నివాసం ఉండటానికి, ఇటుకల తయారీకి ఉపయోగించే నీటికి వ్యవసాయ భూములకు ఉపయోగించే విద్యుత్‌ను వాడుకుంటున్నారు. నిబంధనల ప్రకారం విద్యుత్ శాఖ ద్వారా బట్టీలకు అవసరమైన విద్యుత్ కోసం నిర్వాహకులు అనుమతి తీసుకుని దానికి సంబంధించి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి నిబంధనలు ఏమి పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మైనింగ్ నిబంధనల ప్రకారం సంబంధిత శాఖ నుంచి మట్టి తవ్వకాలకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి తీసుకున్నా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తవ్వకాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక్కడ అనుమతులు లేకుండానే దర్జాగా తవ్వకాలు చేపడుతున్నారు. మట్టిని ఇటుక బట్టీలలో జోరుగా డంపింగ్ చేస్తున్నారు. ఇటుక బట్టీలలో ఇతర రాష్ట్రాల వారు వచ్చి పని చేస్తున్నారు. కుటుంబంతో సహా వస్తున్న కూలీల పిల్లలను బట్టీల్లోనే పనులకు పురామయిస్తున్నారు. దాంతో చిన్నారుల బాల్యం మొత్తం బట్టీలలో గడిసిపోతుంది. పాఠశాలకు వెళ్లాల్సిన చిన్నారులకు పలక బలపం అంటే ఏమిటో తెలియకుండా పెరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అటువైపుగా వెళ్లడం లేదు.

బాలల రక్షణ కోసం చేపడుతున్న ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు అధికారుల కక్కుర్తితో నీరుగారిపోతున్నాయానే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులకు అధికారుల నుంచి అండదండలు పుష్కలంగా ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. ప్రతి నెల వారికి రావాల్సిన మామూళ్లు తీసుకుంటూ అక్రమ వ్యాపారాన్ని అధికారులే ప్రోత్సహిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బట్టీల నిర్వహణపై చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్, రెవిన్యూ, విద్యుత్, ఫారెస్టు, ఇరిగేషన్ అధికారులు తనిఖీలు చేపట్టకుండా కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇటుక బట్టీల నిర్వహణపై తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.


Next Story

Most Viewed