అతడి వెనుక ఎవరున్నారు.. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..?

by Disha Web Desk 19 |
అతడి వెనుక ఎవరున్నారు.. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..?
X

దిశ, ఖమ్మం టౌన్: సీఎం కేసీఆర్ మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని అంటున్నారు. రాష్ట్ర డీజీపీ సైతం మహిళల సమస్యలను తక్షణం పరిష్కరింపజేయాలని అనేక సందర్భాల్లో నిర్వహించిన సమావేశాల్లో పదే పదే కింది స్థాయి సిబ్బందిని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కానీ కింది స్థాయి పోలీస్ సిబ్బంది మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వారికి ఉపయోగం, అధికార పార్టీ సిఫార్సు లేని కేసులు నమోదు చేయడం లేదు. ప్రాథమిక విచారణ జరపడం కోసం కనీసం రశీదు కూడా ఇవ్వడం లేదు. పోలీస్ ఉన్నతాధికారులు, ప్రభుత్వం సామాన్య ప్రజలకు, మహిళలకు అండగా ఉండాలని చెబుతున్నా.. కింది స్థాయి పోలీసులు వాటిని బేఖాతర్ చేస్తున్నారు. అలాంటి ఉదంతం ఒకటి ఖమ్మంలో జరిగింది.

ఖమ్మం జిల్లా వైరా ప్రాంతానికి చెందిన ఓ మహిళ సతీశ్ అనే వ్యక్తి తన వద్ద డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వాలని అడిగినందుకు అతను సదరు మహిళతో అనుచితంగా వ్యవహరించాడు. అంతేకాకుండా ఆ మహిళ గురించి అసభ్యకరంగా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అభ్యంతకరమైన పోస్టులు పెడుతున్నాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె ఫిర్యాదును తీసుకున్న పోలీస్ అధికారులు కేసు నమోదు చేయకపోవడం వెనుక ఓ పోలీస్ ఉన్నతాధికారి ఉన్నాడని సమాచారం. సతీశ్ నివాసం ఉండే అపార్ట్ మెంట్‌కు వెళ్లి బాధిత మహిళలు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో ఖమ్మం జిల్లా మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ పువ్వాళ్ల. పద్మ పాల్గొన్నారు. సతీశ్ అనేక మంది మహిళలతో అనుచితంగా వ్యవహరిస్తాడని.. అతన్ని కఠినంగా శిక్షించాల్సిన పోలీసులు మెతక వైఖరి అవలంభించడం వెనుక కారణాలు తెలపాలని డిమాండ్ చేసారు.

బీజేపీ మహిళా మోర్చా జిల్లాధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ.. సతీశ్‌కు బీజేపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. మహిళలను గౌరవించి, దేశాన్ని ప్రేమించే వారినే బీజేపీ పార్టీ గౌరవిస్తుందని, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ.. మత కలహాలు సృష్టిస్తూ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే వ్యక్తులు మహిళలను అగౌరవ పరుస్తూ మద్యం మైకంలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేసే వారికి స్థానం లేదని అన్నారు. సతీశ్‌కు బీజేపీలో సభ్యత్వం కానీ, పార్టీలో పదవి కానీ లేదని, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో ఉన్న బీజేపీ నాయకులు తనకు పరిచయం ఉన్నట్లు చెప్పుకుంటూ.. ఉద్యోగాల ఎర వేసి డబ్బులు గుంజుతున్నాడని, ఇంకా సమాజంలో సతీశ్ వల్ల ఎవరైన మోసపోయిన మహిళలు, నిరుద్యోగ యువత ఉంటే సమస్యను తమ దృష్టికి తీసుకొని వస్తే.. బీజేపీ అండగా ఉండి సతీశ్ చేస్తున్న అరాచాకాలను ఎండగడుతుందని అన్నారు. సతీశ్ గతంలో కూడా కొన్ని వర్గాలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఖమ్మంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు యత్నించాడు. ఆ సమయంలో లాక్ డౌన్ ఉన్న కారణంగా ఆ గొడవ అంతటితో సమిసిపోయింది. ఇంతటి ఘోరాలకు, నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని అధికార పార్టీ , పోలీస్ ఉన్నతాధికారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారనేది ప్రశ్నగా మిగిలిపోయింది. కొందరు పోలీసులు సివిల్‌లో వెళ్లి ఇతని అపార్ట్ మెంట్‌నే విందు, వినోదాలకు వాడుకుంటారని సమాచారం. కాబట్టే ఇతను ఆ పోలీసుల అండ చూసుకునే విర్రవీగుతున్నాడనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా స్థానిక పోలీస్ ఉన్నతాధికారులు సతీశ్‌పై కఠిమైన చర్యలు తీసుకొని ఖమ్మంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వ్యక్తిని ఊచలు లెక్కపెట్టించాలని పలువురు కోరుతున్నారు. ఇతనికి అండగా ఉండే పోలీసులు ఎవరో ఆరా తీసి వారిపై కూడా శాఖ పరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చేస్తున్నారు.



Next Story