ఏబీసీడీ వర్గీకరణతో వీఆర్ఓలకు కష్టమే

by Disha Web Desk |
ఏబీసీడీ వర్గీకరణతో వీఆర్ఓలకు కష్టమే
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏబీసీడీ వర్గీకరణ లేదా గ్రేడింగ్‌తో చాలా కష్టమని, ఆ విధానమే వద్దని తెలంగాణ విలేజ్ రెవెన్యూ అధికారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై తమకు చీఫ్ సెక్రటరీ స్పష్టత ఇవ్వాలని, ఆందోళనకు గురి చేయొద్దని కోరింది. ఈ మేరకు గురువారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెపాటి నరేష్, సహాయ కార్యదర్శి కందారి భిక్షపతి, ఉపాధ్యక్షుడు ఎస్కే మౌలానా, రామేశ్వర్​రావు, మహిళా కో ఆర్డినేటర్ ప్రతిభ, రాష్ట్ర నాయకులు రాజయ్య, నూకల శంకర్ ఒక ప్రకటన జారీ చేశారు.

రాష్ట్రంలో 5485 మంది వీఆర్వోలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ సంక్షేమ పథకాన్ని అమలు చేశారని, విలువైన ప్రభుత్వ స్థలాలను కాపాడారని, ప్రజలకు అనుక్షణం అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా అహర్నిశలు విధులు నిర్వహించినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ పరిపాలనలో రెవెన్యూ ద్వారా ప్రజలకు చేకూరే ప్రతిఫలాన్ని ప్రజలకు చేరవేశామన్నారు. పలు పథకాల అమలు, వివిధ రకాల దర్యాప్తులు వంటి విధులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏబీసీడీల పేరిట ప్రొఫార్మాల ద్వారా గ్రేడింగ్​చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ మధ్య 5,485 మంది వీఆర్వోలను ఇతర శాఖలలో సర్దుబాటు చేస్తారన్న ప్రచారం జరుగుతుందన్నారు.

ప్రభుత్వం తమపై కక్షసాధింపు దిశగా కాకుండా అందరు ఉద్యోగుల మాదిరిగా చూడాలని కోరారు. తమను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని డిమాండ్​ చేశారు. అర్హులైన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని, మిగతా వారికి సమాన హోదాలో సీనియారిటీకి, ఇతర బెనిఫిట్స్ కి భంగం కలగకుండా చూడాలన్నారు. దాదాపుగా 200 కుటుంబాలు ఆగమవుతున్నాయని, వారికి కారుణ్య నియామకాలను సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం చేపట్టాలన్నారు. 50 ఏళ్ళు పైబడిన వారికి స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలనుకుంటే అవకాశం కల్పించి, వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలన్నారు.

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వీఆర్ఏలకు వెంటనే పే స్కేలు ప్రకటించాలని డిమాండ్​చేశారు. చాలా కాలం నుంచి రెవెన్యూ శాఖలో ప్రమోషన్ల సమస్య పెండింగ్ లో ఉన్నందున కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ప్రమోషన్ల ప్రక్రియ వెంటనే చేపట్టి న్యాయం చేయాలన్నారు. రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దయినందున వారి స్థానంలో ప్రత్యామ్నాయ వ్యవస్థ లేదన్నారు. అందుకే ప్రజలకు ఇబ్బంది కలగకుండా సరిసమానమైన హోదా కల్పించి రెవెన్యూ శాఖలోని కొనసాగించాలని కోరారు.



Next Story