సెమీకండక్టర్ల తయారీ కోసం వేదాంత, ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ ఏర్పాటు!

by Web Desk |
సెమీకండక్టర్ల తయారీ కోసం వేదాంత, ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ ఏర్పాటు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల దిగ్గజ కంపెనీ ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వేదాంత సంస్థ వెల్లడించింది. దేశంలో ఎలక్ట్రానిక్ చిప్, డిస్‌ప్లే ఎకోసిస్టమ్‌ను పెంచేందుకు ప్రభుత్వం రూ. 76,000 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రకటన తర్వాత సెమీకండక్టర్ల తయారీలో పెట్టుబడులు ప్రకటించిన మొదటి సంస్థగా వేదాంత నిలిచింది. ఇరు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. జాయింట్ వెంచర్‌లో మెజారిటీ ఈక్విటీని వేదాంత సంస్థ కలిగి ఉంటుందని, ఫాక్స్‌కాన్ మైనారిటీ వాటాదారుగా ఉంటుందని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత వేదాంత ఛైర్మన్‌గా ఉన్న అనిల్ అగర్వాల్ కొత్తగా ఏర్పాటు కాబోయే జాయింట్ వెంచర్‌కు కూడా ఛైర్మన్‌గా ఉండనున్నారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీకి గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుందని, కొత్త ప్లాంట్ కోసం అనువైన ప్రాంతం కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ ప్రకటన నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఇదే మొదటి జాయింట్ వెంచర్‌గా నిలవనుంది.

Next Story

Most Viewed