Price Hike :ఇక టీవీలు, ఏసీలు, రీఫ్రిజిరేటర్ల ధరలు కూడా పెరగనున్నాయి!

by Disha Web Desk 17 |
Price Hike :ఇక టీవీలు, ఏసీలు, రీఫ్రిజిరేటర్ల ధరలు కూడా పెరగనున్నాయి!
X

న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో దేశంలోని టెలివిజన్, ఏసీలు, రీఫ్రిజిరేటర్లు మరింత ఖరీదు కానున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. కేంద్ర బడ్జెట్ ప్రకటించిన సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ముడి పదార్థాలు, ముఖ్యంగా అల్యూమినియం ఖనిజంపై 30 శాతం దిగుమతి సుంకాన్ని ప్రకటించారు. ప్రధానంగా టీవీలు, ఏసీలు, రీఫ్రిజిరేటర్లు వంటి గృహోపకరణాల తయారీలో ఈ ముడి పదార్థం ఉపయోగిస్తారు. కాబట్టి ఏప్రిల్ నుంచి వీటి ఉత్పత్తి వ్యయం పెరిగే అవకాశం ఉన్నందున, కంపెనీలు రిటైల్ ధరలను పెంచేందుకు వీలుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అల్యూమినియం దిగుమతులపై 30 శాతం పన్ను వల్ల గృహోపకరణాల పరిశ్రమ ఎక్కువ ప్రభావితం అవుతుంది.

కొత్తగా తయారుచేసే టీవీలపై ధరల పెంపు ఉండొచ్చు. అలాగే, కంప్రెసర్ల తయారీలో అల్యూమినియం ముఖ్యమైన ముడి పదార్థం కాబట్టి ఏసీలు, రీఫ్రిజిరేటర్ల ధరలు కూడా పెరగనున్నాయని సూపర్ ప్లాస్ట్రోనిక్స్ సీఈఓ అవ్‌నీత్ సింగ్ అన్నారు. ఓవైపు దిగుమతి సుంకం వల్ల ధరల పెరుగుదలపై ప్రత్యక్షంగా ప్రభావం ఉండగా, మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు, చైనాలో కొవిడ్ లాక్‌డౌన్ వంటి పరిణామాలు దేశీయ ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలను పరోక్షంగా ప్రభావం చూపిస్తాయని తయారీదారులు పేర్కొన్నారు. దీనికితోడు మెటల్, పెట్రోల్ ధరల భారం కూడా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు అదనంగా 7-10 శాతం పెరిగేందుకు కారణంగా ఉండొచ్చని అవ్‌నీత్ సింగ్ వివరించారు.



Next Story