ఇంతకీ ఆ సొమ్ము ఎవరికి చేరుతోంది..? టోల్ గేట్ వ్యవహారంలో మరోకోణం

by Dishanational2 |
ఇంతకీ ఆ సొమ్ము ఎవరికి చేరుతోంది..? టోల్ గేట్ వ్యవహారంలో మరోకోణం
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: అక్రమ టోల్ గేట్ వ్యవహారం వెనక జరిగిన కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.ఈ టోల్ గేట్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది ఎవరూ..? వసూలవుతున్న డబ్బు ఎవరి జేబులు నింపుతున్నాయన్నేద అర్థం కాకుండా పోయింది. దాదాపు ఐదేళ్లుగా ఇక్కడ ఏర్పాటు చేసిన టోల్ గేట్ ద్వారా వాహనాల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అప్పటి నుండి అధికారులు ఎందుకు పట్టించుకోలదన్నదే పజిల్‌గా మారింది. టోల్ గేట్ ఏర్పాటు చేసినప్పటి నుండి ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని తెలుస్తోంది. ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నదెవరూ..? టెండర్ దక్కించుకున్న వారి నుండి డబ్బులు వసూలు చేస్తున్నదెవరూ అన్న విషయంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రజా అవసరాల కోసం తాత్కాలిక వంతెన నిర్మాణం చేసుకోవాలని, అటుగా వచ్చే వాహనాల నుండి టోల్ వసూలు చేసుకోవాలని అనుమతి ఇస్తున్న వారి గురించి కూడా ఆరా తీస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు స్థానికులు. టోల్ వసూలు ప్రారంభించినప్పటి నుండి వసూలైన డబ్బు ఎవరి ఖాతాల్లోకి వెల్లింది..? ఇందులో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు అన్న వివరాలు కూడా తెలుసుకోవల్సిన అవసరం ఉందని అంటున్నారు. అలాగే విలేజ్ డెవలప్ మెంట్ కమిటీ (వీడీసీ) పేరిట టోల్ రశీదులు కూడా ఇస్తున్నందున వీడీసీ బాధ్యులెవరో కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కొంతమంది కావాలనే వీడీసీ పేరిట టోల్ వసూళ్లకు అనుమతి ఇచ్చారా లేక వెన్నుదన్నుగా బడా బాబులు ఉన్నారా అన్న విషయంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నిత్యం వందల సంఖ్యలో నడిచే వాహనాల నుండి వసూలు చేస్తున్న కాంట్రాక్టర్ ఏటా పెద్దపల్లి జిల్లా ఓడెడు, భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి గ్రామాలకు టెండర్ పాట పాడిన డబ్బులు ముట్టచెప్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ రెండు పంచాయితీలకే ఈ నిధులు చేరుతున్నాయా లేక వేరే వారి జేబుల్లోకి వెల్తున్నాయా అన్నదే మిస్టరీగా మారింది.

చట్టబద్దత ఉందా..?

ఓడెడె, గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరు నదిపై ఏర్పాటు చేసిన టోల్ గేట్ వద్ద ఇస్తున్న రశీదులపై విలేజ్ డెవలప్ మెంట్ కమిటీ పేరును ముద్రించారు. అయితే వీడీసీకి చట్టబద్దత లేదని తెలుస్తోంది. చట్టబద్దత లేని కమిటీ పేరిట వీరు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. పంచాయితీరాజ్ చట్టానికి విరుద్దంగా వీరు వీడీసీలను ఏర్పాటు చేసి దర్జాగా టోల్ వసూళ్లకు పాల్పడుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వీడీసీల పేరిట వసూలవుతున్న డబ్బు ఏ అకౌంట్లోకి వెల్తుందో కూడా అర్థం కాకుండా పోతోంది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ టోల్ గేట్ వసూళ్ల ద్వారా రూ. 70 లక్షల నుండి కోటి వరకూ వసూలు చేసి ఉంటారని తెలుస్తోంది.

సీజ్ చేయలేదెందుకో..

రెండు రోజుల క్రితం రెవెన్యూ అధికారులు ఓడెడ్ టోల్ గేట్ వద్దకు వచ్చి తొలగించి కొన్ని రశీదు బుక్కులను స్వాధీనం చేసుకుని వెల్లారు కానీ అక్కడ లభ్యమైన వాటిని పంచనామా చేసి సీజ్ చేసినట్టయితే మళ్లీ టోల్ వసూళ్లకు అవకాశం లేకుండా ఉండేదని అంటున్నారు. కేవలం రశీదు బుక్కులే కాకుండా టోల్ గేట్ కోసం ఏర్పాటు చేసి దండతో పాటు, వసూలు చేసేందుకు వేసుకున్న షెడ్డును కూడా సీజ్ చేస్తే అక్రమ వసూళ్లకు తెరపడేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.



Next Story

Most Viewed