ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్న వైసీపీ ప్రభుత్వం: నాదెండ్ల మనోహర్

by Disha Web Desk 12 |
ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్న వైసీపీ ప్రభుత్వం: నాదెండ్ల మనోహర్
X

దిశ,ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం డబ్బుల కోసం ప్రజలను పీడిస్తుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలను పీడించి వేధించి, ఖజానా నింపుకోవాలనే అహంకారపూరిత నైజం తో సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న మొన్నటి వరకు ఓటీఎస్ పేరుతో పేదల ముక్కుపిండి రూ. వందల కోట్లు గుంజారని అన్నారు. ఇప్పుడు ఆస్తి పన్ను, కుళాయి పన్ను, చెత్త పన్నుల వసూలు విధానంతో ప్రభుత్వం ప్రజల గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పడేస్తున్నాం కదా ప్రజలు మా దగ్గర పడి ఉండాల్సిందే అన్న నియంతృత్వ ధోరణి వైసీపీ ప్రభుత్వంలో కనిపిస్తోందని ద్వజమెత్తారు. ఇదేనా వైసీపీ చెబుతున్న సంక్షేమ పాలన అని నిలదీశారు. తన అహంకారంతో ప్రజల ఆత్మ గౌరవాన్ని జగన్ రెడ్డి దెబ్బ తీస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా ప్రజల గౌరవాన్ని కించపరచ లేదన్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో ఇంట్లో మహిళలు ఉండగానే అధికారులు ఇళ్లకు సీలు వేయడం అనేది అక్రమ గృహ నిర్బందమే అవుతుందన్నారు.

ఆ కుటుంబ సభ్యుల పరువు ప్రతిష్టలను మంటగలిపేలా ప్రభుత్వ పాలకులు ప్రవర్తించారని అన్నారు. ఇది కచ్చితంగా క్రిమినల్ చర్య అని మండిపడ్డారు. ఇటువంటి దుశ్చర్యకు పాలకులను ప్రజలు నిలదీయాలని సూచించారు. ఆస్తి పన్ను వసూలు కోసం జప్తు వాహనాలు తిప్పుతూ పన్ను కట్టకపోతే ఇంట్లో సామాన్లు పట్టుకుపోతాం అని బ్యానర్లు కట్టుకుని తిరగడం వైసీపీ పాలకుల దోపిడీ మనస్తత్వాన్ని వెల్లడిస్తోందన్నారు. ప్రజలు తాగు నీటికి అల్లాడుతుంటే కుళాయిలకు బిరడాలు వేసి వేధిస్తున్నారని ఆరోపించారు.

చెత్త పన్ను కట్టకపోతే చెత్తను తీసుకువచ్చి దుకాణాల ముందు, ఇళ్ల ముందు పోస్తున్నారని అన్నారు. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం కలెక్టర్ ఆ ప్రక్రియ చేయాలన్నారు. అసలు రాష్ట్రంలోని కలెక్టరేట్లో ఆస్తి పన్ను కోట్ల రూపాయిలు బకాయిలు పడి ఉన్నాయని ఎద్దేవ చేశారు. ప్రజల ఆస్తులు జప్తు చేసే ముందు కలెక్టర్ కార్యాలయాలు జప్తు చేయాలన్నారు. అలాగే చెత్త లాంటివి ఇంటి ముందు పోస్తే వివిధ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు దాఖలు చేయవచ్చన్నారు. ప్రజల గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా ప్రభుత్వం చేసే చర్యలను జనసేన తీవ్రంగా ఖండిస్తోంది తెలిపారు.



Next Story

Most Viewed