అసెంబ్లీలో ఉన్నవారంతా టెన్త్‌ ఫెయిల్‌ బ్యాచ్‌: ఎమ్మెల్సీ నారా లోకేష్‌

by Disha Web Desk 13 |
అసెంబ్లీలో ఉన్నవారంతా టెన్త్‌ ఫెయిల్‌ బ్యాచ్‌: ఎమ్మెల్సీ నారా లోకేష్‌
X

దిశ, ఏపీ బ్యూరో: శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలపై బుధవారం సస్పెన్షన్‌ వేటు పడింది. కల్తీసారా, మ‌ద్యంపై చ‌ర్చించాలంటూ టీడీపీ స‌భ్యులు మండలి పోడియం దగ్గర ఆందోళన చేపట్టారు. దీంతో టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్‌ చేస్తూ చేస్తున్నట్లు మండలి ఛైర్మన్‌ ప్రకటించారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్సీలు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నారా లోకేష్‌ మాట్లాడారు. అసెంబ్లీలో ఉన్నవారంతా టెన్త్‌ ఫెయిల్‌ బ్యాచ్‌ అని అన్నారు. వాస్తవాలు బయటపడుతున్నాయనే, వైసీపీ నేతలకు నాటుసారా, కల్తీ మద్యం అంటే భయమని అన్నారు. అధికారమదంతో నోరుపారేసుకుంటున్నారనీ, వాళ్లెవరనీ వదిలిపెట్టను అని ఆయన హెచ్చరించారు. పెగాసస్ అంశంపై చర్చ కేవలం సభా సమయాన్ని వృథా చేయటమేనని అన్నారు. టీడీపీ సభ్యులు సభకు అడ్డుపడుతున్నారంటూ మమ్మల్ని బయటకు పంపిస్తున్నారే తప్ప, సభా నియమాలు, నిబంధనలు పాటించటం లేదని ఆరోపించారు. నాటుసారా మరణాలపై స్పందించటం లేదని లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

మద్య నిషేధ పాలసీపై సీఎం సమాధానం చెప్పాలి.. ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌ బాబు

మద్య నిషేధ పాలసీపై సీఎం జగన్ సమాధానం చెప్పే వరకు వదిలిపెట్టేది లేదని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరిర అశోక్‌ బాబు స్పష్టం చేశారు. జంగారెడ్డి గూడెం కల్తీసారా మరణాలపై ఏదో మెుక్కుబడిగా సీఎం అసెంబ్లీలో సమాధానం చెప్పారు కానీ, కౌన్సిల్‌కు ఎటువంటి సమధానం చెప్పలేదన్నారు. కల్తీసారా మరణాలపై ఉన్న ఆధారాలను ప్రభుత్వానికి సమర్పించినా, ముఖ్యమంత్రి ఎందుకు న్యాయవిచారణకు ఆదేశించలేదని ఆయన ప్రశ్నించారు.


చంద్రబాబు హయాంలోనే కల్తీమద్యం బ్రాండ్లు వచ్చాయంటున్న ముఖ్యమంత్రి.. వాటిని ఇప్పుడు ఎందుకు మార్కెటింగ్‌ చేస్తున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రజల ప్రాణాలంటే జగన్‌కు చులకన భావమని అన్నారు. ఎల్జీపాలీమర్స్‌ దుర్ఘటన జరిగినప్పుడు హుటాహుటిన విశాఖకు వెళ్లి.. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం, నాటుసారా తాగి చనిపోయిన వారి విషయంలో ఎందుకింత నిర్దయగా వ్యవహరిస్తున్నారని అశోక్‌ బాబు ప్రశ్నించారు.

మాట తప్పి, మడమ తిప్పారు.. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు

దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పిన జగన్‌ వాగ్దానం చేశారనీ, ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పి మడమ తిప్పారని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు దుయ్యబట్టారు. కల్తీసారా తాగి చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయమని ఏడు రోజులుగా టీడీపీ సభ్యులందరం పోరాడుతున్నా.. ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్య నిషేధం అన్న జగన్‌ ఇప్పుడు మద్యపానాన్నే తన ప్రభుత్వానికి ఆక్సిజన్‌లా మార్చుకున్నారన్నారు. అప్రజాస్వామికంగా బుధవారం సభ నుంచి ఆరుగురు టీడీపీ సభ్యులను బయటకు పంపించేశారని దువ్వారపు రామారావు ఆరోపించారు.

సమాధానం చెప్పే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా.. ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి

టీడీపీ లేవనెత్తిన అంశాలపై మిగిలిన రెండ్రోజుల్లోనైనా సభకు వచ్చి సమాధానం చెప్పే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి ప్రశ్నించారు. జంగారెడ్డి గూడెం సంఘటనపై కనీసం అర్థగంట చర్చించే దమ్ము, ధైర్యం వైసీపీ ప్రభుత్వానికి లేకుండా పోయాయని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో డబ్బా కొట్టుకుంటూ, చంద్రబాబుపైనా, టీడీపీపైనా సీఎం జగన్‌ బురద జల్లుతున్నారని ఆరోపించారు. నిజంగా ప్రజల ఓట్లతోనే జగన్‌ సీఎం అయితే, మిగిలిన ఈ రెండ్రోజుల్లోనైనా టీడీపీ సభ్యులు లేవనెత్తే అంశాలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

హౌస్‌ అరెస్టులు చేయాల్సిన అవసరం ఏమిటి.. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

పోలీసులతో టీడీపీ నాయకులను హౌస్‌ అరెస్టులు చేయాల్సిన అవసరం ఏమిటని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రశ్నించారు. ఇదే అంశంపై శానన మండలి ఛైర్మన్‌ను నిలదీస్తే ఆయన నోరెత్తలేదని మండిపడ్డారు. కృష్ణా జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను పోలీసుల సాయంతో అడ్డుకునే దుస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై మాట్లాడటానికి సభకు వస్తుంటే, రాకుండా అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. టీడీపీ సభ్యులను భయపెట్టటం ఈ ముఖ్యమంత్రి తరం కాదని బచ్చుల అర్జునుడు స్పష్టం చేశారు.

ప్రజా క్షేత్రంలో దోషిగా నిలబడక తప్పదు.. ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌

అధికార మదంతో సభలో సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి తప్పించుకోవచ్చు కానీ.. ప్రజాక్షేత్రంలో మాత్రం దోషిగా నిలబడక తప్పదని టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ అన్నారు. కల్తీసారా మరణాలపై చర్చకు పట్టు పట్టి పోడియంపైకి వెళ్లామని చెప్పడం అర్థరహితమని వైసీపీ నేతల మాటలను కొట్టిపారేశారు. మండలిలో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేయటం జరగలేదనీ, జగన్‌ సీఎంగా వచ్చాకే ఇటువంటి పనికిమాలిన పోకడలకు పోతున్నారని ఆరోపించారు. నాటుసారా తాగి చనిపోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి న్యాయం చేయాల్సిందేనని రామ్మోహన్‌ డిమాండ్‌ చేశారు.


Next Story

Most Viewed