నిర్మాణ సంస్థలపై ఐటీ పంజా.. రాజకీయ కోణంలోనే దాడులు?

by Disha Web Desk 2 |
నిర్మాణ సంస్థలపై ఐటీ పంజా.. రాజకీయ కోణంలోనే దాడులు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు చేస్తున్న నిర్మాణ సంస్థల లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ దృష్టి పెట్టింది. వందలు, వేల కోట్లు పనులు చేస్తూ ఇన్ కం ట్యాక్స్ చెల్లించకుండా, ఒకవేళ చెల్లిస్తున్న సరైన లావాదేవీలు చూపించకుండా దాచి పెడుతున్న కంపెనీలను టార్గెట్ చేసింది. దీనిలో భాగంగా బుధవారం నాలుగు సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేసింది. ఈ దాడులను ఆదాయ పన్నుశాఖ అధికారికంగా ప్రకటించలేదు. నాలుగు నిర్మాణ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో సోదాలకు దిగినట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు వందల కోట్లు ఆదాయ పన్ను ఎగవేసినట్లు సదరు సంస్థలు కూడా అంగీకరించాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఐటీ దాడుల వెనక రాజకీయ కోణం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా.. తాజాగా ఐటీ అధికారులు సోదాలు చేసిన సంస్థలు కూడా గులాబీ నేతల అండదండలు ఉన్నవే కావడం గమనార్హం.

ఈసారి టార్గెట్​ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేస్తున్న నాలుగు సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. ఈ జాబితాలో మళ్లీ కేఎన్ఆర్ సంస్థ కూడా ఉంది. ఇప్పటికే ఓ విడుత కేఎన్ఆర్ సంస్థపై ఐటీ రైడ్స్​జరిగిన విషయం తెలిసిందే. తాజాగా కూడా కేఎన్ఆర్ ఇన్ఫ్రా, గజ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్‌వీఆర్, జీవీఆర్ కంపెనీలపై దాడులు చేసి ఆదాయ పన్ను వివరాలు సేకరించారు. ఈ దాడుల సందర్భంగా ఆదాయ పన్ను ఎగవేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రిజర్వాయర్లు, ఎత్తిపోతల కాల్వలు, పైపులైన్లు, టన్నైల్​పనులు చేస్తున్న సంస్థలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఒక్కో సంస్థ రూ. 1000 కోట్లకుపైగా పనులు చేస్తోంది.

ట్యాక్స్​ ఎగవేత ఒప్పుకున్నారు?

ఐటీ దాడుల సందర్భంగా కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ అధినేతలుగా ఉన్న నర్సింహారెడ్డి, జలంధర్​రెడ్డిలు తాము రూ.150 కోట్ల లావాదేవీలకు ట్యాక్స్ కట్టలేదని అధికారుల ముందు అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా గజ ఇంజినీరింగ్ సంస్థ కంపెనీలో జరిగిన సోదాల్లోనూ రూ.50 కోట్ల విలువైన లావాదేవీల్లో పన్ను కట్టలేదని అధికారుల ముందు ఒప్పుకున్నారు. మరో కంపెనీ ఆర్వీఆర్ సంస్థ రూ.60 కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. అటు జీవీఆర్​ సంస్థలో కూడా సోదాలు జరుగుతున్నాయి.

గులాబీల చేతుల్లోనే!

బుధవారం ఐటీ రైడ్స్​ జరిగిన నాలుగు ప్రధాన సంస్థలకు అధికార పార్టీ నేతలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే అనుమానాలు బలంగా ఉన్నాయి. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను దక్కించుకున్న రెండు పెద్ద సంస్థల్లో ఒక సంస్థ నుంచి పనులన్నీ లాగేసుకున్నారనే ఆరోపణలు ముందు నుంచీ ఉన్నాయి. ఈ పనులను సబ్​కాంట్రాక్ట్‌గా ఆయా కంపెనీలు చేస్తున్నాయి. తాజాగా పనులు చేస్తున్న సంస్థలన్నీ గులాబీ నేతల చేతుల్లోనే ఉన్నాయని తెలుస్తోంది.

కంపెనీ : కేఎన్​ఆర్​ఇన్ ఫ్రాస్ట్రక్షర్,జీవీఆర్​కన్​స్ట్రక్షన్.

చేస్తున్న పనులు: ఏదుల రిజర్వాయరు నిర్మాణ పనులు ఈ రెండు సంస్థల కలిసి పని చేశాయి. ముందుగా జీవీఆర్‌కు అప్పగించిన పనులు ఆలస్యమవుతుండటంతో.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి అండతో కేఎన్ఆర్ కంపెనీ ఎంటరైంది. దీంతో ఈ రెండు సంస్థలు ఇరిగేషన్‌లో కీలక పనులు చేపట్టాయి. ఏదుల రిజర్వాయరు రూ.700 కోట్లతో పాటుగా మల్లన్నసాగర్​రిజర్వాయరు పనులు చేశారు. వట్టెంల రిజర్వాయరు నుంచి నవయుగను తొలిగించిన ప్రభుత్వం ఈ కేఎన్ఆర్, జీవీఆర్ సంస్థలకు అప్పగించాయి.

కంపెనీ పేరు: గజ ఇంజినీరింగ్​ ఇన్​ఫ్రాస్ట్రక్షర్

చేస్తున్న పనులు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సత్యం రామలింగరాజు కుటుంబానికి చెందినదే ఈ గజ ఇన్​ఫ్రాస్ట్రక్షర్. ఆయన తనయుడు తేజ్​రాజ్​దీని అధినేత. మైథాస్​సంస్థను ప్రభుత్వం బ్లాక్​లిస్టులో పెట్టడం, నిర్మాణ పనుల నుంచి తొలిగించిన నేపథ్యంలో గజ ఇంజినీరింగ్​ఇన్​ఫ్రాస్ట్రక్షర్​పేరుతో రీ ఓపెన్​చేశారు. ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి ఈ కంపెనీకి వెనకుండి నడిపిస్తున్నారు. ఈ సంస్థ వట్టెం రిజర్వాయరు సబ్​కాంట్రాక్టర్. మెఘా కన్​స్ట్రక్షన్​నుంచి సబ్​తీసుకుని ఏదుల టూ వట్టెంల టన్నెల్​పనులు రూ. 1000 కోట్లతో చేస్తున్నారు.

ఇక్కడే మరో కంపెనీ దీపికా కన్​స్ట్రక్షన్​కూడా రూ.1000 కోట్లతో మరికొంత టన్నెల్ పనులు చేస్తోంది. ఓ ఎమ్మెల్యేకు చెందిన సొంత అల్లుడు దీపికా కన్​స్ట్రక్షన్ కంపెనీ అధినేత. ఓ ఎమ్మెల్సీ కూడా ఈ సంస్థలో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

కంపెనీ పేరు: ఆర్​వీఆర్

చేస్తున్న పనులు: ఈ కంపెనీ కూడా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని 16వ ప్యాకేజీ పనులు చేస్తోంది. నవయుగ నుంచి తీసుకున్న పనులను ఈ కంపెనీకి అప్పగించారు. వాస్తవంగా ఏపీకి చెందిన వ్యక్తి చేతిలో ఉన్నప్పటికీ.. ఓ మంత్రి దీనికి అండదండ.

బడా కంపెనీలపై అప్పుడప్పుడు ఐటీ దాడులు జరుగుతూ ఉంటాయి. అది మామూలే. కాకపోతే.. ఎక్కువగా ఇన్ ఫ్రా రంగంలో ఉన్న కంపెనీలపై గురిపెడుతూంటారు. ఈ సారి ఫార్మా కంపెనీపై దృష్టి పెట్టారు. అది ఓ సంచలనం అయితే.. అది టీఆర్ఎస్ ఎంపీకి చెందినది కావడం మరో సంచలనం. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ నేతలు.. టీఆర్ఎస్ పెద్దలకు చెందిన అత్యంత సన్నిహితులైన వారి కంపెనీలపై వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నారు. వందల కోట్ల బ్లాక్ మనీ లావాదేవీల్ని గుర్తించినట్లుగా చెబుతూనే ఉన్నారు. ఇవన్నీ.. అవసరమైనప్పుడు బయటకు తీసి ఉపయోగించుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్‌ను ఇటీవల కాలంలో బీజేపీ టార్గెట్ చేసిందని చెబుతున్నారు. బెంగాల్‌లోనూ ఇలా టీఎంసీ నేతల్ని టార్గెట్ చేసి కొన్ని కేసులు నమోదు చేశారు. శారదా చిట్స్ సహా పలు కేసుల్ని నమోదు చేశారు. అన్నీ కేంద్ర సంస్థల కేసులే. ఆ తర్వాత వరుసగా ఒక్కొక్కర్ని టార్గెట్ చేశారు. ఇప్పుడుఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి.. వారంతా బీజేపీలో చేరిపోయారు. ఉన్న కొద్ది మందిపై ఎన్నికల సమయంలో సీబీఐ, ఐటీ, ఈడీలు నోటీసులు జారీచేస్తున్నాయి. వారు కూడా టీఎంసీ తరపున యాక్టివ్‌గా ఉండకుండా చూసుకుంటున్నారు. తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అలాంటి వ్యూహాన్ని దీర్ఘకాలికంగా అమలు చేస్తోందన్న అనుమానం టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది.

Next Story