పాలమూరుకు పైసా ఇవ్వలే.. పనుల్లేవ్​.. నిధులూ లేవు

by Disha Web Desk |
పాలమూరుకు పైసా ఇవ్వలే.. పనుల్లేవ్​.. నిధులూ లేవు
X

దిశ, తెలంగాణ బ్యూరో : దక్షిణ తెలంగాణను సశ్యశ్యామలం చేసేందుకు నిర్మించతల పెట్టామని పదేపదే చెప్పే ప్రభుత్వం కీలక ప్రాజెక్టుకు వెనకాడుతోంది. బడ్జెట్​లో అరకొర నిధులు పెట్టింది. మరోవైపు ఈ ప్రాజెక్టు పనులు ఆపాలని ఎన్జీటీ స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ స్టే వెకెట్​ చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. కేవలం అటవీ భూములకు సంబంధించిన నివేదికను ఎన్జీటీకి ఇస్తే స్టే ఎత్తివేస్తారని నీటిపారుదలరంగ నిపుణులు ఏండ్ల నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ, ప్రభుత్వం ఈ రిపోర్టును ఎన్జీటికి అప్​లోడ్​ చేసేందుకు వెనకాడుతోంది. ప్రస్తుతం పనులు నిలిపివేయడంతో అటు కార్పొరేషన్​ నుంచి రూపాయి కూడా రుణం రావడం లేదు. ఫలితంగా పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టు ఆర్థిక కష్టాల నుంచి బయటకు రావడం లేదు.

పాలమూరు పడావుబెట్టి..

కృష్ణా ప్రాజెక్టులపై ప్రభుత్వం మొదటి నుంచీ నిర్లక్ష్యం చూపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలమూరు ప్రాజెక్టును రీ డిజైన్‌‌ పేరుతో జూరాల నుంచి శ్రీశైలానికి మార్చింది. ప్రాజెక్టులోనూ మార్పులు చేసింది. 2018లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉన్నా, నిధులు ఇవ్వకపోవడంతో నిర్మాణ వ్యయం రూ.35 వేల కోట్ల నుంచి రూ. 55 వేల కోట్లకు పెరిగింది. రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయాల్సిన ఈ ప్రాజెక్టును తర్వాత ఒక టీఎంసీకే పరిమితం చేసింది. ప్రాజెక్టు ఫస్ట్​ పంపుహౌస్‌‌ (ఎల్లూరు)ను మొదట ఓపెన్‌‌ కట్‌‌గా ప్రతిపాదించి తర్వాత అండర్‌‌ గ్రౌండ్‌‌కు మార్చారు. అండర్‌‌ గ్రౌండ్‌‌ పంపుహౌస్‌‌ కోసం చేసిన బ్లాస్టింగ్స్‌‌తో కల్వకుర్తి పంపుహౌస్‌‌ మునిగిపోయిన విషయం తెలిపిందే. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పుతున్నా.. ఇంకా పెండింగ్​ బిల్లులే రూ. 2 వేల కోట్లు ఉన్నాయి.

మహబూబ్​నగర్​ జిల్లా భూత్పూరు మండలం కరివేన దగ్గర నిర్మించే ఈ ప్రాజెక్టుకు 2015, జూన్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా డీపీఆర్​ చేశారు. మరోవైపు హైదరాబాద్‌ సిటీకి తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వికారాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తాగునీరు, సాగునీరు అందించే లక్ష్యాలతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది.

అడ్డంకులు.. నిర్లక్ష్యం

ఈ ప్రాజెక్టు మొదలుపెట్టిన తొలినాళ్లలోనే ప్రస్తుతం టీఆర్ఎస్‌లో చేరిన అప్పటి కాంగ్రెస్​నేత హర్షవర్ధన్​రెడ్డి కోర్టెకెక్కారు. దీనిపై అప్పటి ఇరిగేషన్​ ఇంజినీర్లు అఫిడవిట్​దాఖలు చేశారు. తాగునీటి కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టుగానే సూచించడంతో కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టుపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలపై ఫిర్యాదు చేయడంతో.. అటు ఏపీ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డిపై ప్రతిదాడికి దిగింది. ఎన్జీటీలో ఫిర్యాదు దాఖలైంది. ఎన్జీటీ స్టే ఇవ్వడంతో పనులు నిలిపివేసినట్లు ప్రభుత్వం తాజాగా కృష్ణా బోర్డుకు అఫిడవిట్​ ఇచ్చింది. ఇక్కడ పనులేమీ జరుపడం లేదంటూ తేల్చింది. ఎన్జీటీలో స్టే ఎత్తివేయడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలేమీ చేయడం లేదని ఇరిగేషన్​ ఇంజినీర్ల వాదన. భూ సేకరణ సమయంలో ఈ ప్రాజెక్టు కోసం అటవీ శాఖ నుంచి 700 ఎకరాలు సేకరించారు. దీనికి సంబంధించిన నష్టపరిహారాన్ని కూడా అటవీ శాఖకు చెల్లించారు. ప్రజాభిప్రాయ సేకరణ సైతం తీసుకున్నారు. దీంతో ఎన్విరాల్​మెంట్​ క్లియరెన్స్​ వచ్చింది.

ఎన్జీటీకి ఎందుకివ్వడం లేదు

అటవీ భూములు, ఎన్విరాల్​మెంట్​ క్లియరెన్స్​పై ఎన్జీటీ స్టే విధించింది. కానీ, ఐదేండ్ల కిందటే చేసిన భూ సేకరణ, దానికి ఫారెస్ట్​ నుంచి క్లియరెన్స్​ను ప్రభుత్వం తరుపున ఇప్పటికీ ఎన్జీటీకి నివేదించలేదు. దీంతో స్టే ఎత్తివేయడం లేదు. ఎన్జీటీలో స్టే ఎత్తివేయడం కేవలం 10 రోజుల్లోనే జరుగుతుందని, కానీ ప్రభుత్వం ఈ నివేదికను ఎందుకు ఎన్జీటీకి ఇవ్వడం లేదనే అనుమానాలు నీటిపారుదల రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అటు రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ, ఇటు పాలమూరు –రంగారెడ్డిపై తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నాయనే అపవాదు కూడా మూటగట్టుకుంటున్నారు.

నిధులేవీ.?

కృష్ణా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులను ప్రభుత్వం ప్రతిసారీ అరకొరగానే చేస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఈసారి కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఈసారి బడ్జెట్​లో రూ. 1225 కోట్లతో సరిపుచ్చారు. ఈ నిధులు నిర్వహణకు సరిపోతాయి. అంతేకానీ, పనులు చేసేందుకు సరిపోవు. అంతేకాకుండా పెండింగ్​ బిల్లులు కూడా పేరుకుపోయాయి. కొన్నిచోట్ల భూ సేకరణ కూడా పెండింగ్ పడింది. వీటన్నింటకీ కనీసం ఇప్పుడు రూ. 6 వేల కోట్లు కావాల్సి ఉంది. ఇంకా పనులు చేయాలంటూ మరో ఐదారు వేల కోట్లు అనివార్యమే. ఒకవేళ కార్పొరేషన్​ రుణాల ద్వారా సమీకరించుకుందామన్నా.. ప్రస్తుతం పనులు నిలిపివేయడం, అటు కేంద్రం గెజిట్​లో అనుమతి లేని ప్రాజెక్టుగా నమోదు కావడంతో అప్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం కష్టమే.

పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టుకు చేసిన బడ్జెట్‌‌ కేటాయింపులు (రూ.కోట్లలో)

ఏడాది నిధులు

2019–20 504

2‌‌020–21 368.58

2021–22 960

2022–23 1225

Next Story

Most Viewed