ఆ ఇంటి నిర్మాణానికి అనుమతించింది వారే.. కూలగొట్టింది వారే

by Disha Web Desk 12 |
ఆ ఇంటి నిర్మాణానికి అనుమతించింది వారే.. కూలగొట్టింది వారే
X

దిశ, అందోల్: కాయం కష్టం చేసుకుని పైసా..పైసా కూడబెట్టి...ఇంటి కలను నెరవేర్చుకునేందుకు...అనుమతి తీసుకుని ఇంటి నిర్మాణం చేపడితే...అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి...నిర్మాణం పనులను కూల్చేశారు. ఆందోల్–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 3 వ వార్డు లోని మల్లన్న కాలనీకి చెందిన పొలపల్లి నర్సింలు అనే వ్యక్తి తనకున్న 135 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం పనుల కోసం మున్సిపల్‌ అధికారుల అనుమతికి దరఖాస్తు చేసుకున్నాడు.

పత్రాలను పరిశీలించిన అధికారులు మున్సిపల్‌ నిబంధనల ప్రకారం అనుమతి కోసం రుసుము రూ.69,800 చెల్లించిన నర్సింలుకు మున్సిపల్‌ అధికారులు ఇంటి నిర్మాణానికి అనుమతినిచ్చారు. గత నెల రోజుల క్రితం ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించగా, ఈ నెల 5వ తేది నాడు మున్సిపల్‌ అధికారులు నిర్మాణం వద్దకు వచ్చి జేసీబీ సహయంతో సంప్, కంపౌండ్‌ వాల్, సెప్టిక్‌ ట్యాంక్‌లను ధ్వంసం చేశారు. సుమారు రూ.2 లక్షల వరకు నష్టం జరిగినట్లు బాదితుడు తెలిపారు.

అనుమతి ఉన్నా ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రశ్నిస్తే రోడ్డు పరిధిలోకి వచ్చే విధంగా నిర్మాణం ఉందంటూ దౌర్జన్యంగా కూల్చివేశారు. తాను నిబంధనల ప్రకారమే అనుమతిని తీసుకుని, నిర్మాణాన్ని చేపడుతున్నానని, అనుమతి పత్రాలు వారికి చూపించినా, అవేవి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేసిన తమపై దౌర్జన్యానికి సైతం దిగారని బాధితుడు ఆరోపించారు. తనకు న్యాయం జరిగే వరకు కుటుంబ సభ్యులతో కలిసి పోరాటం చేస్తానని, ఉన్నతాధికారులు స్పందించి, మున్సిపల్‌ అధికారుల అగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. తాము ఒక వేళ అనుమతిచ్చిన స్థలం కంటే ఎక్కువ స్థలంలో నిర్మాణం చేసినట్టయితే దాన్ని తొలగించాలని వేడుకున్నా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అనుమతి ఎందుకు ఇచ్చారు?

మున్సిపల్‌ నిబంధనల ప్రకారం తనకున్న 135 గజాల స్థలానికి అనుమతిని పొందిన తర్వాత కూల్చివేయడంపై మున్సిపల్‌ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటి నిర్మాణం అక్రమంగా చేపడితే ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని అధికారులకు తెలియదా..? ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు..? అధికారులకు రాజకీయ పరమైన ఒత్తిడి లు ఏమైనా ఉన్నాయా..? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేగాక ఇంటి అనుమతులిచ్చేటప్పుడు పత్రాలను, స్థలాన్ని చూడకుండానే ఇచ్చారా..? అధికారులు ఎందుకు ఏకపక్షంగా వ్యవహరించారనే విషయమై స్థానికంగా చర్చ జరుగుతుంది. నిర్మాణం పనులు ప్రారంభించిన నెల రోజుల తర్వాత పనులను అడ్డుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.

గత అధికారి అనుమతించారు: అశ్రిత్‌ కుమార్, కమిషనర్, జోగిపేట

ఇంతకు ముందు కమిషనర్‌గా పనిచేసిన అధికారి ఇంటి నిర్మాణానికి అనుమతిచ్చారు. అనుమతి ఇచ్చే సమయంలో ఇంకా కొన్ని డాక్యూమెంట్లు అవసరమున్నా అందులో చేర్చలేదు. నిర్మాణ సమయంలో రోడ్డు ఆక్రమిస్తున్నారని, కొలతలు చేసుకోవాలని ఇంటి యజమానికి మౌఖికంగా సూచించాము. తమ సిబ్బందితో కొలతలు చేయడంతో నిర్మాణం రోడ్డు లోపలికి రావడం తోనే జేసీబీతో తొలగించాం.

Next Story

Most Viewed