Liquid diet: లిక్విడ్ డైట్.. సురక్షితమేనా?.. గుండెపై ప్రభావం ఉంటుందా..

by Disha Web |
Liquid diet: లిక్విడ్ డైట్.. సురక్షితమేనా?.. గుండెపై ప్రభావం ఉంటుందా..
X

దిశ, ఫీచర్స్ : ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ అనుమానాస్పద గుండెపోటుతో మరణించడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, వార్న్ చనిపోవడానికి ముందు 14 రోజుల పాటు 'ఎక్స్‌ట్రీమ్ లిక్విడ్ డైట్'‌ పాటించినట్లు నివేదికలు సూచిస్తుండగా.. దీనివల్ల కలిగే ఆరోగ్య నష్టాలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో లిక్విడ్ డైట్‌‌లో తీసుకునే ఆహారాలు ఎంత వరకు సురక్షితం? శరీరంపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి?

'ఆపరేషన్ ష్రెడ్ ప్రారంభమైంది & జూలై నాటికి కొన్నేళ్ల కిందటి పూర్వఆకృతికి తిరిగి రావడమే లక్ష్యం! లెట్స్ గో' అనే క్యాప్షన్‌తో తన మునుపటి ఫిట్‌నెస్ బాడీని పోస్ట్ చేశాడు వార్న్. దీన్ని బట్టి క్రికెట్ ఐకాన్ షేర్ వార్న్ తన బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం కాగా.. 14 రోజుల పాటు కేవలం లిక్విడ్స్ మాత్రమే స్వీకరించిన విషయాన్ని అతని మేనేజర్ జేమ్స్ ఎర్‌స్కైన్ కూడా ధృవీకరించాడు. ఇక వార్న్ కుమారుడు సైతం తన తండ్రి '30-రోజుల ఫాస్టింగ్ టీ డైట్'లో ఉండేవారని పేర్కొనగా.. గతంలో అనేక సార్లు ఇలాంటి డైట్స్ పాటించినట్లు అతడి స్నేహితులు వెల్లడించారు. అయితే వార్న్ అకాల మరణానికి లిక్విడ్ డైట్ కారణమనేందుకు ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ.. 'ఎక్స్‌ట్రీమ్ డైట్'‌కు దూరంగా ఉండటమే ఉత్తమమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గడమే ఈ లిక్విడ్ డైట్స్ లక్ష్యం కాగా.. సూప్స్, షేక్స్, ఫ్రూట్, వెజిటేబుల్ డ్రింక్స్ వంటివి ఈ బాబితాలో ఉన్నాయి.

లిక్విడ్ డైట్ ప్రమాదాలు :

శరీరంలోని ఐరన్ నిల్వలు వినియోగించబడటంతో మహిళల్లో రక్తహీనత తలెత్తి, కండర ద్రవ్యరాశి క్షీణిస్తుంది.

శరీరం సాధారణ పనితీరును కనబర్చేందుకు గట్, ఊపిరితిత్తులు, కాలేయం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.

తలనొప్పి, మైకం, విపరీతమైన అలసట, అతిసారం లేదా మలబద్ధకం.

పండ్ల రసాల్లో పుష్కలంగా ఉండే సహజ ఆమ్లాలు దంతాల మీది ఎనామెల్‌ను దెబ్బతీస్తాయి. కేలరీలు లభించక శ్వాస వాసన భిన్నంగా ఉంటుంది.

క్రాష్ డైట్స్ పిత్తాశయ రాళ్లను అభివృద్ధి చేసే ప్రమాదముంది.

బరువు కోల్పోవడం, కొన్ని రోజుల తర్వాత తిరిగి పొందడం వల్ల ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు ఎదురవుతాయి.

అన్ని సందర్భాల్లో కాకున్నా కొన్నిసార్లు తక్కువ కేలరీలు గల ఆహారాలు గుండెపై ఒత్తిడి, ప్రభావం చూపుతాయి. డైట్‌లో భాగంగా తీసుకునే ద్రవ పదార్థాలు ప్రాథమిక పోషకాలను అందించాల్సి ఉంటుంది కానీ ఇలా జరగదు. ఇలాంటి ఆహారాల్లోని ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సరైన సమతుల్యతను కలిగి ఉండవు. ఇది దీర్ఘకాలికంగా హాని కలిగించవచ్చు. ఇక లిక్విడ్ డైట్ పాటించిన వారం రోజుల తర్వాత అలిసిపోయినట్లు భావిస్తారు. అందుకే గర్భిణులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఇన్సులిన్ తీసుకునేవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు లిక్విడ్ డైట్‌కు దూరంగా ఉండాలి. ఏవైనా అంతర్లీన అనారోగ్య పరిస్థితులున్నా డైట్ ప్రారంభించే ముందు డైటీషియన్‌ను సంప్రదించాలి.

- ప్రొఫెసర్ గ్యారీ జెన్నింగ్స్, హార్ట్ ఫౌండేషన్ చీఫ్ మెడికల్ అడ్వైజర్

Next Story

Most Viewed