కలెక్టర్ ఆదేశాలతో ఆరు ఆస్పత్రులు బంద్.. ఇబ్బంది పడుతున్న రోగులు..

by Dishafeatures2 |
కలెక్టర్ ఆదేశాలతో ఆరు ఆస్పత్రులు బంద్.. ఇబ్బంది పడుతున్న రోగులు..
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : సాధారణ ప్రసవాలను పెంచే విషయంలో కొన్ని ఆస్పత్రులపై నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం పట్ల వైద్యులు ఆందోళనకు దిగారు. నిర్మల్ జిల్లా భైంసాలో రెండు, నిర్మల్‌లో నాలుగు ఆస్పత్రుల్లోని ప్రసూతి వార్డులను కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం రోజున సీజ్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు అవగాహన లేకుండా.. ఏకపక్షంగా, కక్షపూరితంగా కొన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకోవటం పట్ల ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం సాయంత్రమే సమావేశం కాగా.. బుధవారం రోజున నిర్మల్, భైంసా పట్టణాల్లో ఆసుపత్రులు, మెడికల్ దుకాణాలు, ల్యాబ్‌లు నిరవధికంగా బంద్ చేయాలని నిర్ణయించారు.

దీంతో బుధవారం ఉదయం నుంచి ఆస్పత్రులతో పాటు మెడికల్ షాపులను కూడా మూసి వేశారు. నిర్మల్ లోని ఐఎంఏ హాల్లో వైద్యాధికారులతో పాటు మెడికల్ షాపుల యజమానులు సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. ఆరు ఆసుపత్రుల్లోని ప్రసూతి వార్డులను సీజ్ చేయటం పట్ల ఐఎంఏ, ఎన్డీఏ, బీడీఏ తీవ్రంగా ఖండించింది. కలెక్టర్ నిర్ణయంతో ఆస్పత్రులను మూసివేయటంతో రోగులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో నిర్మల్‌లోని ఆదిత్య ఆస్పత్రిలో రోగులు, వారి బంధువులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.

మరోవైపు వైద్యులతో చర్చలు నిర్వహించేందుకు.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాల మేరకు జడ్పీ చైర్ పర్సన్ భర్త, టీఆర్ఎస్ నేత కొరిపెల్లి రాంకిషన్ రెడ్డి ఐఎంఏ హాల్‌కు వెళ్లారు. జిల్లా కలెక్టరుతో తాము మాట్లాడుతామని, ఆస్పత్రులు తెరవాలని కోరారు. జిల్లా కలెక్టరుతో సమావేశమయిన తర్వాత తమ నిర్ణయం ఏంటనేది చెబుతామని ఐఎంఏ ప్రతినిధులు తేల్చి చెప్పారు. దీంతో జిల్లా కలెక్టరుతో సమావేశానికి ఐఎంఏ నుంచి ఏడుగురు ప్రతినిధులకు అవకాశం కల్పించారు. కలెక్టరుతో సమావేశంలో వచ్చే హామీని బట్టి ఆస్పత్రులను తెరవాలా.. బంద్ కొనసాగించాలా.. అనే విషయంపై స్పష్టత వస్తుందని ఐఎంఏ ప్రతినిధులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed