వీడియోలు వైరల్: అక్కడ చీకటయితే చాలు.. తెల్లవార్లూ అదే పని

by Dishanational1 |
వీడియోలు వైరల్: అక్కడ చీకటయితే చాలు.. తెల్లవార్లూ అదే పని
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మానేరు నది కేంద్రంగా జోరుగా ఇసుక దందా సాగుతోంది. అక్రమంగా సాగుతున్న ఈ దందా ప్రభుత్వం టెండర్లకు పిలిచి ఏర్పాటు చేసే రీచ్ లను మరిపిస్తున్నాయి. కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యాంకు దిగువన సస్సెన్షన్ బ్రిడ్జి నుండి ప్రతి గ్రామం నుండి ఇసుక అక్రమ రవాణా సాగుతూనే ఉంది. ట్రాక్టర్లు, ఇసుక మాఫియా టీమ్ లు గా ఏర్పడి దర్జాగా దందా కొనసాగిస్తున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారు. నిత్యం వేలాది ట్రాక్టర్లలో ఇసుక తరలిపోతున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

చీకటి అయితే చాలు...

చీకటి అయితే చాలు అప్పటి నుండి తెల్లవార్లూ ట్రాక్టర్లలో ఇసుక లోడింగ్ చేస్తున్న తీరును గమనిస్తే ఇక్కడ అనుమతి పొందిన క్వారీలను మరిపిస్తుందో లేదో స్పష్టం అవుతుంది. రాత్రి నండి తెల్లవారుజాము వరకూ కరీంనగర్ పరిసరాల్లోకి చేరుకున్న ట్రాక్టర్లకు గ్రీన్ సిగ్నల్ రాగానే అవి నేరుగా మానేరులోకి వెళ్లి ఇసుక నింపుకుని వెళ్తుంటాయి. ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ. 5 వేల వరకూ ధర పలుకుతుండడంతో నిత్యం వేలాది ట్రాక్టర్లు అక్రమ దందాలో పాలు పంచుకుంటున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు.

ఆ రూల్ ఏమైంది..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక మాఫియాపై కొరడా ఝులిపిస్తామని ప్రకటించింది. మొదటి సారి దొరికిన ట్రాక్టర్ కు ఇంత, రెండోసారి అయితే ఇంత మూడోసారి అయితే సీజ్ చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు దొరికిన ట్రాక్టర్ల నెంబర్లను పరిశీలించే పరిస్థితి లేకపోవడంతో ఈ రూల్ ను అమలు చేసే పరిస్థితే లేకుండా పోయింది.

గొడవలకు కేరాఫ్...

ఇసుక మాఫియాలో వర్గాల మధ్య గొడవలు కూడా తీవ్ర రూపం దాల్చుతున్నాయి. గతంలో ఓసారి కరీంనగర్ సమీపంలోని మానేరు తీరంలో గొడవ జరగగ అధికార పార్టీ నాయకుడు ఒకరు మానేరు నదిలో ఇసుక తరలించే విషయంలో గొడవ చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అలాగే కరీంనగర్ సమీపంలోని మరో గ్రామంలో కూడా పది రోజుల క్రితం ఇరు వర్గాల మధ్య దాడులు చేసుకున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ గొడవకు కారణమైనవారికి పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చి పంపించారు.

సర్వ సాధారణం..

గతంలో కరీంనగర్ తోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో వందల్లో కూడా లేని ట్రాక్టర్లు నేడు వేల సంఖ్యకు చేరుకున్నాయి. ఓ వైపున కరీంనగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతుండగా వ్యవసాయ అవసరాల కోసం కొనుగోలు చేస్తున్న ట్రాక్టర్లు ఎందుకు కొనుగోలు చేస్తున్నారు, వాటిని ఎందుకు ఉపయోగిస్తున్నారు అన్న విషయం తెలిస్తే చాలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు పలువురు. మానేరు నది పరివాహక ప్రాంతంలోని ఏ గ్రామంలో చూసినా పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు కనిపిస్తున్నాయంటే ఇసుక దందా ఎంతమేర సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.

భూ గర్భ జలాలకు సవాల్..

ఇసుక తొలగించడం వల్ల భూ గర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. దీనివల్ల మానేరు పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టం అట్లడుగుకు చేరే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురుకానున్న నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణా గురించి పట్టించుకునే వారే లేకుండా పోయారు. అడపాదడపా పోలీసులు పట్టుకుని ట్రాక్టర్లపై కేసులు నమోదు చేస్తున్నారు కానీ మైనింగ్ విజిలెన్స్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్వవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

Next Story

Most Viewed