దాడులు మరింత భీకరం: ఉక్రెయిన్‌పై ఆగని రష్యా అటాక్స్

by Disha Web Desk 17 |
దాడులు మరింత భీకరం: ఉక్రెయిన్‌పై ఆగని రష్యా అటాక్స్
X

కీవ్/మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా సేనలు మరింత భీకరంగా విరుచుకుపడుతున్నాయి. ఆయుధ కారాగారాలను ధ్వంసం చేయడమే తమ లక్ష్యమని చెప్పుకుంటూ వస్తున్న రష్యా.. తాజాగా, పౌర ప్రాంతాల పైనా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఫలితంగా రోజూ పదుల సంఖ్యలో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. యుద్ధం మొదలై గురువారంతో 22 రోజులు ముగిసినా.. ఉక్రెయిన్‌ సైన్యం తీవ్ర ప్రతిఘటనతో ఆ దేశంపై రష్యా పట్టు సాధించలేకపోతున్నది. దీంతో వీలైనంత త్వరగా ఉక్రెయిన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో దాడులను మరింత ఎక్కువ చేస్తున్నది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్‌పై సమీపంలోని మెరిఫాపై గురువారం తెల్లవారు జామున ఫిరంగుల దాడులకు పాల్పడింది. ఈ దాడిలో 21 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా, ఓ స్కూల్, కల్చరల్ సెంటర్ పూర్తిగా ధ్వంసమయ్యాయని మెరిఫా మేయర్ వెనియామిన్ సితోవ్ వెల్లడించారు. ఖర్కీవ్‌పైనా పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. అయితే, చాలా మంది పౌరులు నగరాన్ని వీడటంతో ప్రాణనష్టం తప్పిందని స్థానిక అధికారి వెల్లడించారు. ఖర్కీవ్‌ ఆక్రమణకు రష్యా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, తమ సైన్యం గట్టి జవాబు చెబుతోందని పేర్కొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed