వీరి సమస్య తీరేనా.. కట్టుబానిసలుగా 'నిమ్స్' కాంట్రాక్టు నర్సులు

by Dishanational2 |
వీరి సమస్య తీరేనా.. కట్టుబానిసలుగా నిమ్స్ కాంట్రాక్టు నర్సులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అత్యంత ప్రతిష్టాత్మకమైన నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో గత పది రోజులుగా కాంట్రాక్టు నర్సులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నా వైద్య ఆరోగ్య శాఖకు చీమ కుట్టినట్టైనా లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు‌కు బహిరంగ లేఖ రాశారు. రెగ్యులర్ ఉద్యోగులతో సరి సమానంగా విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు నర్సులు తమ కనీస డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా కోరుతుంటే వైద్య ఆరోగ్య శాఖ పెడచెవిన పెట్టడం దుర్మార్గమన్నారు. ప్రసూతి సెలవుల దగ్గర నుంచి జీతాలకు సంబంధించిన పే స్లిప్పులు కూడా ఇవ్వకపోవడం తీవ్రమైన అన్యాయమన్నారు. ఇది కట్టు బానిసత్వం కిందకు వస్తుందని, పేద రోగులకు సేవ చేయడంలో నర్సుల పాత్ర కీలకమన్నారు. నర్సులు విధులు బహిష్కరిస్తే ఆ ప్రభావం పేదరోగుల వైద్యసేవలపై తీవ్రంగా ఉంటుందన్నారు. గత పది రోజులుగా నిమ్స్‌లో ఇదే జరుగుతోందన్నారు. 423 మంది స్టాఫ్ నర్సులు విధులు బహిష్కరించి, నిత్యం ఎర్రటి ఎండలో నిరసన తెలుపుతున్నారని, నిమ్స్ యాజమాన్యం కానీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హారీష్ రావు కానీ దీనిపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఏళ్ల తరబడి రెగ్యులర్ ఎంప్లాయిస్‌తో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న ప్రసూతి సెలవులు కూడా ఇవ్వడం లేదని, అటానమస్ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని కూడా వారు ఆరోపిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న తమను ప్రతి ఆరు నెలలకు ఒకసారి విధుల నుంచి తొలగించి మళ్లీ తీసుకుంటున్నారని, దీని వల్ల సీనియారిటీ కోల్పోతున్నారని వారు తెలిపినట్లు వివరించారు. సమస్యల పరిష్కారం కోసం పది రోజులుగా ఆందోళన చేస్తున్న స్టాఫ్ నర్సుల సమస్యపై మంత్రి స్వయంగా దృష్టి సారించాలని, వాళ్ల కనీస డిమాండ్లను పరిష్కరించాలని, మంత్రి స్వయంగా నిమ్స్‌కు వెళ్లి వారితో చర్చలు జరిపాలని, వాళ్ల డిమాండ్లను ఆమోదించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే పేద రోగులకు అందాల్సిన వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, కనుక తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.

జాతీయ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు : ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్

తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు నర్సుల సమస్యలను విస్మరిస్తోందని ఆరోగ్య మంత్రి హరీష్ రావుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ మంగళవారం ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టు నర్సులు పోరాటం చేస్తుంటే ప్రభుత్వం స్పందించడం లేదని, వీరికి పెర్మనెంట్ నర్సులు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. వారి సమస్యలపై మంత్రి హరీష్ రావు చర్చలకు సమయం ఇస్తలేడని అన్నారు. వీరి న్యాయం అయిన కోరికలను వెంటనే తీర్చాలని జాతీయ మానవ హక్కులకు మంత్రి పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎన్‌హెచ్ఆర్‌సీ కేసును స్వేకరించిందన్నారు. 12 సంవత్సరాల అనుభవం ఉన్న వారిని పెర్మనెంట్ చేయకపోవడం దారుణమన్నారు. నిమ్స్ డైరెక్టర్ ఎయిమ్స్ స్కేల్ జీతం తీసుకుంటున్నారని, కానీ నర్సలకు ప్రభుత్వ స్కేల్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదని, కేవలం ప్రైవేట్ ఆస్పత్రులను పెంచి పోషించడానికి ప్రభుత్వ ఆస్పత్రుల ప్రతిష్టను కావాలనే కేసీఆర్ ప్రభుత్వం దిగజారుస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed