ఏడు నెలల గరిష్ఠానికి జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం!

by Web Desk |
ఏడు నెలల గరిష్ఠానికి జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో ఏడు నెలల గరిష్ఠానికి చేరింది. ఆహార, తయారీ వస్తువుల ధరలు పెరగడం వల్ల వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం జనవరి నెలలో 6.01 శాతానికి పెరిగింది. అంతకుముందు డిసెంబర్‌లో 5.66 శాతంగానూ, గతేడాది జనవరిలో 4.06 శాతంగా సీపీఐ ద్రవ్యోల్బణం నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు సోమవారం వెల్లడించాయి. జాతీయ గణాంక కార్యాలయం(ఎన్ఎస్ఓ) విడుదల చేసిన డేటా ప్రకారం.. ఆహార రిటైల్ ద్రవ్యోల్బణం సమీక్షించిన నెలలో 5.43 శాతంగా ఉంది. అంతకుముందు నెలలో ఇది 4.05 శాతంగా నమోదైంది. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం అధికంగానే ఉంది. అయితే దేశీయంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలుగుతోంది. అయితే, కరోనా ప్రభావం కారణంగా 2020 తర్వాత నుంచి ఇప్పటివరకు టీ, వంట నూనె, పప్పులు వంటి రోజూవారీ నిత్యావసర వస్తువుల ధరలు 20-40 శాతం వరకు పెరిగాయి. ఇటీవల రుతుపవనాలు, పంట దిగుబడి, సరఫరా మెరుగుపడటం వంటి కారణాలతో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ఆర్‌బీఐ వివరించింది. సమీక్షించిన నెలలో నూనెలు, కొవ్వు విభాగం ద్రవ్యోల్బణ రేటు 18.7 శాతానికి, ఇంధన ద్రవ్యోల్బణం 9.32 శాతానికి పెరిగాయి. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ధరల పెరుగుదల తీవ్రంగా ఉంది. గ్రామీణ ద్రవ్యోల్బణం జనవరిలో 5.36 శాతం నుంచి 6.12 శాతానికి, పట్టణ ద్రవ్యోల్బణం 5.91 శాతానికి పెరిగింది. జనవరి నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యం కంటే స్వల్పంగా ఎగువన ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పనిలేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం ఓ కార్యక్రమంలో అన్నారు. ద్రవ్యోల్బణ అంచనాలు పటిష్టంగా ఉన్నాయి.


Next Story

Most Viewed