షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ ఛైర్మన్ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత!

by Disha Web Desk 2 |
షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ ఛైర్మన్ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత!
X

ముంబై: ఆసియాలో విలాసవంతమైన హోటళ్లు, స్టేడియంలు, ప్యాలెస్, ఫ్యాక్టరీలను నిర్మించిన దేశీయ ఇంజనీరింగ్ సంస్థ షాపూర్‌జీ పల్లోంజి గ్రూప్ అధినేత, ఛైర్మన్ పల్లోంజి మిస్త్రీ కన్నుమూశారు. ఆయనకు 93 ఏళ్లు. దేశీయ అతిపెద్ద గ్రూప్ సంస్థ టాటా సన్స్‌లో ఆయన 18.4 శాతం వాటాతో అతిపెద్ద మైనారిటీ షేర్‌హోల్డర్‌గా ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి ముంబైలోని స్వగృహంలో ఆయన మృతి చెందినట్టు, నిద్రలోనే తుదిశ్వాస విడిచారని కంపెనీ వర్గాలు ధృవీకరించాయి.

పల్లోంజి మిస్త్రీకి మొత్తం నలుగురు సంతానం కాగా, వీరిలో పెద్ద కుమారుడు షాపూర్‌జీ ప్రస్తుతం సంస్థ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మరో కుమారుడు సైరస్ మిస్త్రీ ఇదివరకు టాటా సన్స్ ఛైర్మన్‌గా చేశారు. మరో ఇద్దరు కుమార్తెలు లీలా, ఆలూ ఉన్నారు. పల్లోంజి మిస్త్రీ భారత పారిశ్రామిక రంగంలో చేసిన సేవలను గుర్తిస్తూ 2016లో ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది. బ్లూమ్‌బర్గ్ అంచనాల ప్రకారం, పల్లోంజి మిస్త్రీ సంపద రూ. 2.28 లక్షల కోట్లు కాగా, ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ఆయన 125వ ర్యాంకును కలిగి ఉన్నారు. దీంతో ఆయన భారత్‌లోనే కాకుండా యూరప్‌లోనూ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అంతేకాకుండా 2021లో ఆయన దేశీయ అత్యంత సంపన్నుల్లో తొమ్మిదవ స్థానంలో నిలిచారు.

పల్లోంజి మిస్త్రీ 1929లో జన్మించారు. ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లో చదువు అభ్యసించిన ఆయన, లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత మిస్త్రీ భారతదేశానికి తిరిగి వచ్చి 1954లో వ్యాపారాన్ని చేపట్టారు.

Next Story

Most Viewed