మంత్రి పర్యటన సందర్భంగా హడావుడి.. చివరి నిమిషంలో అసలు విషయం గుర్తొచ్చి..

by Disha Web |
మంత్రి పర్యటన సందర్భంగా హడావుడి.. చివరి నిమిషంలో అసలు విషయం గుర్తొచ్చి..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హరిత తెలంగాణ అంటే అమాత్యులు వచ్చే ముందు హడావుడిగా ఏర్పాట్లు చేయడం... ఆయన వచ్చే మార్గంలో మొక్కలు నాటడం అన్నట్టుగా తయారైంది జిల్లా అధికార యంత్రాంగం తీరు. మరో గంటలో కరీంనగర్ రానున్న మంత్రి కేటీఆర్ రాక కోసం భారీ ఏర్పాట్లు చేసిన అధికార పార్టీ నాయకులు, జిల్లా అధికారులు రూ. 615 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల కోసం సమాయత్తం అయ్యారు. అయితే చివరి నిమిషంలో అసలు విషయం గుర్తించిన అదికారులు తమ తప్పు బయటకు రాకూడదనకున్నారో లేక... మంత్రి పర్యటనలో హరితమయం లేదని నిలదీస్తారనుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు రోడ్లపై మొక్కలు నాటే పనిలో నిమగ్నం అయ్యారు.

రోడ్డు మార్గం గుండా వస్తున్న మంత్రి కేటీఆర్ ప్రధాన రహదారికి ఇరువైపులా, డివైడర్లపై పచ్చదనం కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎలా అని భావించి గురువారం ఉదయం తిమ్మాపూర్ మండలం అల్గునూరు చౌరస్తాతో పాటు ప్రధాన రహదారుల్లో మొక్కలు నాటి వాటికి ప్రత్యేకంగా ట్రీ గార్డులు ఏర్పాటు చేస్తున్నారు. పచ్చదనం ఫరడవిల్లితే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని సీఎం కేసీఆర్ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు కానీ, ప్రముఖుల పర్యటనలో వారికి కనిపించే విధంగా మొక్కుబడి తంతులా చూడాలని కాదని స్థానికులు కామెంట్ చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ బోసిపోయి కనిపించిన అల్గునూరు చౌరస్తా మంత్రి కేటీఆర్ టూర్ సందర్భంగా హరిత విప్లవాన్ని మరిపిస్తోందని అంటున్న వారు లేకపోలేదు. ఏది ఏమైనా మంత్రి పర్యటన సందర్భంగా నాటిన మొక్కలను శాశ్వతంగా కాపాడేందుకు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు

Next Story

Most Viewed