బెడిసికొట్టిన సర్కార్ ప్లాన్.. టవర్ల యూనిట్‌కు మంగళం?

by Disha Web Desk 2 |
బెడిసికొట్టిన సర్కార్ ప్లాన్.. టవర్ల యూనిట్‌కు మంగళం?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజీవ్ స్వగృహ టవర్ల అమ్మకాలపై సందిగ్ధత నెలకొంది. ఒక్క సంస్థ కూడా వీటిని కొనేందుకు ముందుకు రాలేదు. కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేయించలేదు. దీంతో ఆఖరి నిమిషం వరకూ రిజిస్ట్రేషన్‌కు అనుమతిచ్చారు. అయినా వాటికి నో రెస్పాన్స్ వచ్చింది. దీంతో వాటిని అమ్మడంపై మళ్లీ పునరాలోచనలో పడ్డారు. టవర్ యూనిట్‌గా అమ్మడాన్ని క్యాన్సిల్​ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైల్‌ను సీఎంకు పంపించారు. కానీ, నిర్ణీత గడువు ముగిసే వరకూ ఎదురుచూద్దామని ప్రభుత్వం తరుపున ఆదేశాలివ్వడంతో శుక్రవారం వరకూ ఎదురుచూశారు. ఒక్క సంస్థ కూడా టెండర్లలో పాల్గొనలేదు.

ఎలా మరి?

స్వగృహను టవర్ల వారీగా విక్రయానికి పెట్టిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్.. ధరలను కూడా భారీగా కేటాయించింది. తొలుతగా రెండుచోట్ల విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నాగోల్‌లోని బండ్లగూడలో 15 టవర్లను కనీస ధరగా చదరపు అడుగుకు రూ.2200 నుంచి రూ.2700లకు, ఖమ్మం జిల్లా పోలేపల్లిలోని 8 టవర్లకు చదరపు అడుగుకు రూ.1500 నుంచి రూ. 2 వేలుగా ధరలను ఖరారు చేస్తూ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టెండర్లలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లకు చివరితేదీ మార్చి 22గా ఉండగా, ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో గురువారం వరకూ అవకాశం కల్పించారు. అయినా ఎవరూ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. వాస్తవంగా రియల్ సంస్థలు ధరలను తగ్గించాలని ఇప్పటికే సూచించారు. బండ్లగూడలో చదరపు అడుగుకు రూ.1200 నుంచి రూ.1400, పోలేపల్లిలో రూ.600 నుంచి రూ.900 వరకే పెట్టాలని సూచించారు. మరోవైపు ప్రభుత్వమే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిబంధనల్లోనే స్పష్టం చేసింది. కానీ ప్రభుత్వం ఇప్పుడు నిర్మించిన ప్రకారం విక్రయిస్తే ఎవరూ కొనరని, చాలా మార్పులు చేయాల్సి ఉంటుందని రియల్ సంస్థలు సమాధానమిస్తున్నారు.

బ్లాక్ మనీ భయం

మరోవైపు సంస్థలకు బ్లాక్ మనీ భయం కూడా వెంటాడుతోంది. ఇప్పుడు ప్రభుత్వం విక్రయించే ఈ ఇండ్లను కొనుగోలు చేస్తే వాటికి చెల్లించే ప్రతిపైసా లెక్క చూపించాల్సి ఉంటోంది. దీంతో రియల్ సంస్థలు ఆదాయపు పన్నుకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని, ఈ కారణంతో కూడా వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కొనుగోలు చేయడమే కాకుండా అమ్మిన ఇండ్లకు కూడా లెక్కలు చూపించాల్సి రావడంతో భయపడుతున్నారు.

నేడు సీఎస్ పరిశీలన

ప్రభుత్వం అనుకున్న ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో స్వగృహ ఇండ్లను ఒక్కో ఇంటి వారీగా అమ్మాలని మళ్లీ ప్రతిపాదనలు పంపించారు. కానీ సీఎం దగ్గర పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం టెండర్లకు కూడా ఎవరూ రాకపోవడంతో వీటి విక్రయాలపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిలో భాగంగా శనివారం రాజీవ్​స్వగృహ ఇండ్లను సీఎస్​సోమేష్​కుమార్ పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు పోచారంలో, మధ్యాహ్నం వరకు బండ్లగూడలోని రాజీవ్​స్వగృహ సముదాయాల్లో పర్యటించి, అక్కడి పరిస్థితులపై మరో నివేదికను సీఎంకు అప్పగించనున్నారు.

Next Story