వైరా సైడ్ డ్రైనేజీ పనుల్లో నాణ్యత 'సైడ్'.. రూ. కోట్లు వృథా?

by Dishanational1 |
వైరా సైడ్ డ్రైనేజీ పనుల్లో నాణ్యత సైడ్.. రూ. కోట్లు వృథా?
X

దిశ, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన సైడ్ డ్రైనేజీల నిర్మాణాల్లో పనులు నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. మున్సిపాలిటీ, ఆర్ అండ్ బీ శాఖ నిధులు రూ. 4.50 కోట్లతో వైరా మున్సిపాలిటీ పరిధిలోని వైరా రాష్ట్ర రహదారికి ఇరువైపులా అలాగే వైరా నుండి మధిర వైపు వెళ్లే రహదారికి ఒకవైపు సైడ్ డ్రైనేజీ నిర్మాణానికి కాంట్రాక్ట్ దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్ నిర్మాణ పనులు మాత్రం నాసిరకంగా ఉన్నాయని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సైడ్ డ్రైనేజీ నిర్మాణానికి రోడ్డుకు ఇరువైపులా ఉన్న మట్టిని కాంట్రాక్టర్ బహిరంగంగానే ట్రాక్టర్ల ద్వారా అమ్ముకున్నట్లు సమాచారం.

మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్లు తమ తమ వార్డులలో గుంటలను పూడ్చేందుకు మట్టిని అడిగినా.. నిరాకరించి ఆ మట్టిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఇళ్ల స్థలాలకు ఓపెన్ ప్లాట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు కనీసం కంటి చూపు మేరలో కూడా కనబడటంలేదని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో కాంక్రీట్ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ తీరు అందుకు నిదర్శనమని వాపోతున్నారు. దీంతో ఆర్ అండ్ బీ, మున్సిపల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని పలువురు ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 4 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని పలువురు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Next Story

Most Viewed