ఇదీ రోడ్డేనా.. వేసిన వారానికే 'పగుళ్లు'

by samatah |   ( Updated:2022-03-20 06:03:17.0  )
ఇదీ రోడ్డేనా.. వేసిన వారానికే పగుళ్లు
X

దిశ, నర్సంపేట : సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించక పోవడంతో వేసిన వారం రోజులకే సీసీ రోడ్డుపై పగుళ్లు ఏర్పడ్డాయి. గుత్తేదారు నాసిరకం పనులు చేపట్టారు, వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసిన సంఘటన దుగ్గొండి మండలంలోని తిమ్మంపేటలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిమ్మంపేట గ్రామంలో ఈజీఎస్ నిధుల ద్వారా 180 మీటర్ల సీసీ రోడ్డు రూ.10 లక్షల వ్యయంతో కేటాయింపులు జరిగాయి. పోయిన వారమే సీసీ రోడ్డు నిర్మాణం సైతం పూర్తి చేశారు. పనులు సరిగ్గా చేపట్టలేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీపీఐ ఎం ఎల్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు భూమా అశోక్ మాట్లాడుతూ.. సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్నారు. అధిక మొత్తంలో డస్ట్ పోయడంతోనే పగుళ్లు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. కాంట్రాక్టర్ లాభాపేక్ష కారణంగానే వేసిన వారం రోజులకే పరిస్థితి ఇలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రెడిమిక్స్ కంపెనీ, కాంట్రాక్టర్‌ల అక్రమం కారణంగానే సిమెంట్, కంకర ఇసుక కలపాల్సిన రీతిలో కాకుండా డస్ట్ ఎక్కువ కలిపారని ఆరోపించారు. ఈ కారణంతోనే రోడ్డు అనుకున్నంత నాణ్యత లేదన్నారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పైన, రెడ్ మిక్స్ కంపెనీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ కార్యదర్శి కుమార్ సతీష్ కుమార్, రైతు కూలీ సంఘం నాయకులు ఎల కంటి కుమారస్వామి, నల్లగొండ రాజ్ కుమార్, శివరాత్రి కుమార్, కడారి నాగేష్, గొల్లేన జైపాల్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story