భారీ వర్షాలపై నిజామాబాద్, జగిత్యాల కలెక్టర్లతో సమీక్షించిన ఎంపీ అర్వింద్

by Disha Web Desk 12 |
భారీ వర్షాలపై నిజామాబాద్, జగిత్యాల కలెక్టర్లతో సమీక్షించిన ఎంపీ అర్వింద్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: గత మూడు, నాలుగు రోజులుగా నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి రెండూ జిల్లా కలెక్టర్‌లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని ఎంపీకి వివరించారు. ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రస్తుతానికి జిల్లాలో పరిస్థితి అదుపులో ఉందని నిజామాబాద్ నగర శివారులో గల పాంగ్రా, గూపన్ పల్లి గ్రామాలలో ముంపు ప్రాంతాల బాధితుల కోసం 2 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు వర్షాల కారణంగా ముగ్గురు మరణించినారని తెలిపారు.

అలాగే 232 ఇండ్లు పాక్షికంగా, మూడిళ్ళు పూర్తిగా కూలిపోయాయని, అదేవిధంగా ఇప్పటివరకు 7,900 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు. మహారాష్ట్రలో అధికంగా వర్షాలు పడుతున్నందున శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 75 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉందని, పై నుంచి వస్తున్న వరదను ప్రస్తుతం 26 గేట్ల ద్వారా విడుదల చేస్తున్నామని ఎంపీ కి వివరించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లా రాయికల్ గోదావరి వద్ద 9 మంది రైతులు వరదల్లో చిక్కుకున్నారని, ఎన్డీఆర్ఎఫ్ బలగాల సహాయంతో స్పీడ్ బోట్ ద్వారా గాని లేదా చాపర్ ద్వారా గాని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే పనుల్లో నిమగ్నమయ్యామని తెలిపారు. అంతేకాకుండా ఇప్పటివరకు 6 ఇండ్లు పూర్తిగా, 158 ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని కలెక్టర్ వివరించారు.

నియోజకవర్గ నాయకులు.. మండల అధ్యక్షులతో ఎంపీ జూమ్ సమావేశం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్ జగిత్యాల జిల్లాల నియోజకవర్గ నాయకులు, మండలాల అధ్యక్షులతో ఎంపీ అరవింద్ జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. ఇరు జిల్లాల కలెక్టర్లతో పర్యవేక్షణ చేస్తున్నానని బీజేపీ కార్యకర్తలు పునరావాస కేంద్రాల్లో భోజనం, బట్టలు, దుప్పట్లు అందజేసేలా చర్యలు చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తన కార్యాలయ సిబ్బందిని సంప్రదించి తక్షణమే నా దృష్టికి తీసుకురావాలని కోరారు. నాయకులందరూ వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే పంట నష్టం పై క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు నష్టపరిహారం అందించే విషయంలో అండగా ఉండాలని ఎంపి పేర్కొన్నారు.


Next Story

Most Viewed