ఆడబిడ్డ పెళ్ళికి మేనమామగా సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 13 |
ఆడబిడ్డ పెళ్ళికి మేనమామగా సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి
X

దిశ, దేవరకద్ర: సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి మేనమామగా మారి వారికి లక్ష రూపాయల సాయం అందిస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. దేవరకద్ర మండల కేంద్రం శ్రీనివాస గార్డెన్ ఫంక్షన్ హాల్ లో దేవరకద్ర, చిన్నచింతకుంట, మదనపురం, అడ్డాకల్, కొత్తకోట, మూసాపేట, భూత్పూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి - షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై 547 మంది లబ్దిదారులకు చెందిన రూ.5,47,63,452 చెక్కులను పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కళ్యాణలక్ష్మి కార్యక్రమం చేపట్టిందని, పేదోళ్ళ కష్టం నాకు తెలుసని, పెళ్ళి కోసం చేసిన అప్పులను ఈ చెక్కుల ద్వారా వాటిని కట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. కల్యాణలక్ష్మి దరఖాస్తులపై సంతకం చేసేటప్పుడు నాకు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిదని సంతోషం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎవరూ ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టలేదని, దేశంలోనే తొలిసారిగా కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.


చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే లబ్దిదారులందరితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు, జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, రైతు కోఆర్డినేటర్లు, దేవస్థాన కమిటీ చైర్మన్, ఏడు మండలాలకు సంబంధించిన ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ లు, మండల పార్టీ నాయకులు, మండల యువ నాయకులు, గ్రామ అధ్యక్షుడు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.





Next Story