మండు వేసవిలో తాగునీటి కష్టాలు.. మిషన్‌ భగీరథ నీటి సరఫరాకు బ్రేక్‌!

by Disha Web Desk 2 |
మండు వేసవిలో తాగునీటి కష్టాలు.. మిషన్‌ భగీరథ నీటి సరఫరాకు బ్రేక్‌!
X

సిద్దిపేట స్కీమే రాష్ట్రానికి విస్తరించింది.. దాని పేరే మిషన్ భగీరథ అదెక్కడినుంచో అమెరికా నుంచి రాలే.. యావత్ రాష్ట్రానికి ఇవ్వాళ్ల అద్భుతమైన మంచినీటి సదుపాయం.. చాలా గొప్ప సదుపాయం... నేను చెప్తలేను కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది.. నంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా.. 98.31% ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చిన ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అని చెప్తా ఉన్నది. చాలా సంతోషం.. ఇది మీ బిడ్డ సాధించిన ఘనత ఇది. = సిద్దిపేట సభలో సీఎం కేసీఆర్, డిసెంబర్ 10, 2020

"ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నాం. గతంలో తాగునీళ్ల కోసం రోడ్లపై బిందెలు అడ్డం పెట్టి అడ్డుకునేవారు. కానీ, ఇప్పుడు నీళ్లు వస్తలేవు అనే మాటే రావడం లేదు. 35వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్త ట్యాంకులు కట్టి, నల్లాలు పెట్టి నీళ్లిస్తున్నాం." = అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్

గ్రామాలను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. 36 వేల కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం జనం దాహార్తిని తీర్చడం లేదు. లీకేజీలు ఏర్పడ్డా.. సాంకేతిక సమస్యలు వచ్చినా పరిష్కరించే నాథుడు కరువయ్యాడు. భూగర్భ జలాలు అడుగంటి పోవడం, బోర్లు వట్టిపోవడం, నల్లాల్లో నీళ్లు రాకపోవడంతో ప్రజలు అగచాట్లు తప్పడం లేదు. నల్లానీళ్ల కోసం ఖాళీబిందెలతో ఆందోళనలు మొదలయ్యాయి. ఎక్కడికక్కడ స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. కేంద్రం సైతం మెచ్చుకున్న మిషన్ భగీరథ కింద 98.31% ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీ వేదికగా వెల్లడించినా.. ఇప్పుడు నల్లా తిప్పితే నీళ్లు రాకపోవడం విడ్డూరం!

ఇదీ పరిస్థితి..

హుజూరాబాద్​ మండలంలోని కాట్రపల్లి, రంగాపూర్, బోర్నపల్లి గ్రామాల్లోకి భగీరథ నీళ్లు రావడం లేదు. గతంలో ఎస్సారెస్పీ రోజువిడిచి రోజు ఎస్సారెస్పీ కెనల్ నుంచి తుమ్మనపల్లి ఫిల్టర్ బెడ్ వద్ద వెల్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి నీటిని 18 గ్రామాలకు నీటిని తరలించేవారు. దానిని కట్ చేసి భగీరథకు కనక్షన్ ఇచ్చారు. కరీంనగర్ లోని ఫిల్టర్ అయిన నీళ్లు లిఫ్ట్ ద్వారా బోర్నపల్లి గుట్టకు చేరుకుంటాయి. అక్కడి నుంచి గ్రావిటీ పైప్ లైన్ల గుండా హుజూరాబాద్, హుస్నాబాద్ సెగ్మెంట్ల పరిధిలోని గ్రామాలకు నీరందించేందుకు ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో వాయువేగంతో ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. వారం రోజుల పాటు శుద్ధ జలాలు ఊరూరికి చేరాయి. ఆ తర్వాత బ్రేక్.. ఇటు తుమ్మనపల్లి ఫిల్టర్ బిడ్ క్లోజ్ కావడం, లీకేజీలు, స్టకప్ ల కారణంగా బోర్నపల్లి గుట్ట నుంచి నీళ్లు రాకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తల్లడిల్లుతున్నారు. అక్కడక్కడ కొన్ని గ్రామాలకు నీరందుతున్నా.. అవి కూడా పాత ట్యాంకులకు ఇచ్చిన కనెక్షన్లవే .. భగీరథ జలం జనం పంచకు చేరడం లేదనేందుకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.. ఇది ఒక్క హుజూరాబాద్, హుస్నాబాద్ సమస్యే కాదు.. గద్వాల జిల్లాలోని అయిజ, అలంపూర్ లోనూ తాగునీటి కోసం జనం నానా తిప్పలు పడుతున్నారు. నీళ్లివ్వండి మహాప్రభో అని రోడ్డెక్కుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మిషన్‌ భగీరథ నీటి సరఫరాకు బ్రేక్‌ పడింది. భగీరథ నల్లాల నీళ్లు వారం రోజులే మురిపించాయి. ఆ తర్వాత బంద్​ అయ్యాయి. గ్రామాల్లో ఇప్పుడు పాత నల్లాలు రాక, మిషన్​ భగీరథ నల్లాలూ పని చేయక నీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతో పలు చోట్ల ఖాళీ బిందెలతో మళ్లీ రోడ్డెక్కుతున్నారు. మరోవైపు చాలా గ్రామాల్లో ఇప్పటి వరకు మొత్తం పైప్‌ లైన్లు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణం పూర్తి కాలేదు. కొన్నిచోట్ల నిర్మించిన 4నెలలకే ఓవర్​ హెడ్​ ట్యాంకులు పగిలిపోతున్నాయి. చేపట్టిన పనులు నాసిరకంగా ఉంటుండటంతో చాలా చోట్ల పైపులైన్లు లీక్‌ అవుతున్నాయి. దీంతో చాలా గ్రామాల్లో మురికి నీరు వస్తున్నాయి. చెత్తతో కూడిన నీరు వస్తుండటంతో ప్రజలు తాగు అవసరాలకు వినియోగించడం లేదు. బట్టలు ఉతికేందుకు, స్నానాలకు, మరుగుదొడ్లకు ఉపయోగించుకుంటున్నారు.

రెండూ రావడం లేదు

గ్రామాల్లో ఇది వరకే నల్లా కనెక్షన్లు ఉన్నాయి. టీఆర్​ఎస్​ సర్కారు మాత్రం రూ. 35 వేల కోట్లు ఖర్చు పెట్టి పాత పైపులు, పాత ట్యాంకులకే కొత్త రంగులేసి అత్యంత ప్రతిష్టాత్మకమైన మిషన్​ భగీరథ ప్రాజెక్టుగా చూపిస్తున్నారు. ఇంకా చాలా ప్రాంతాలకు మంచినీరు రావడం లేదు. సగానికిపైగా పాత పైపులు, పాత ట్యాంకులు, పాత నల్లాలే మిషన్​ భగీరథ కింద మళ్లించారు. పాత వాటర్​ ట్యాంకులకు కొత్తగా బ్లూ కలర్​ వేయించి మిషన్​ భగీరథగా మార్చేశారు. వాస్తవంగా గతంలో గ్రామాల్లో రెండురోజులకోసారి పుష్కలంగా నీళ్లిచ్చారు. కానీ మిషన్​ భగీరథకు మార్చిన తర్వాత నల్లాలు అలంకార ప్రాయంగా మారాయనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇటీవల హుజురాబాద్​ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందర్భంగా పాత నల్లాలు ఉన్నప్పటికీ.. కొత్తగా ఏర్పాటు చేసి మిషన్​ భగీరథ నీళ్లు వస్తున్నాయంటూ హడావుడి చేశారు. దీంతో పాత నల్లాలను బంద్​ చేశారు. రోజు విడిచి రోజు.. ఇలా వారం రోజులు ఇచ్చి ఆ తర్వాత భగీరథ నల్లాలు మూత పడ్డాయి.

భారీ ఖర్చు

మిషన్​భగీరథ కోసం ప్రభుత్వం రూ. 36 వేల కోట్లు చేసినట్లు వెల్లడించింది. ఇంకా కొన్ని గ్రామాల్లో ఇంట్రా విలేజ్​ వర్క్స్​, ఓవర్​ హెడ్​ట్యాంకులు, నల్లాలు తదితర పనుల కోసం మరో రూ. 4 వేల కోట్లు అవసరమున్నట్లు ఇటీవల అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు భగీరథ పనుల కోసం హడ్కో, కమర్షియల్‌‌ బ్యాంకుల నుంచి 80% నిధులు అప్పుగా తీసుకున్నారు. వాటికి రీ పేమెంట్స్​కూడా మొదలయ్యాయి. మొత్తం 23,890 గ్రామాలు, 121 మున్సిపాలిటీల్లో భగీరథ పథకం పనులను 2016లో చేపట్టారు. చాలా మేరకు పాత ట్యాంకులు, పాత పైపులైన్లనే ఈ పథకాన్ని వినియోగించారని తెలుస్తున్నది. రాష్ట్రమంతటా 1.05 లక్షల కిలోమీటర్ల మేరకు పైపులైన్లు వేయించినట్లు ప్రభుత్వం మిషన్​ భగీరథ ప్రగతి నివేదికల్లో వెల్లడించింది. కానీ గ్రామాల్లో గతంలో వేసిన పైపులైన్లనే ఈ పథకంలో చూపించారు. చాలా ప్రాంతాల్లో ఇంట్రా విలేజ్​ వర్క్స్​ పూర్తి కాలేదు. మరికొన్నిచోట్ల క్వాలిటీ లేని పైపులను తక్కువ లోతులో వేయడంతో చిన్నపాటి ఒత్తిడికే పగిలిపోయాయి. పలుచోట్ల లీకేజీలు ఏర్పడుతున్నాయి.

నిరసనలు.. నిలదీతలు

వేసవి కావడంతో గ్రామాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. నల్లా నీళ్లు రాకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. పరిస్థితి చేయిదాటిపోతున్నా.. సమస్య పరిష్కరించే నాథుడు కరువయ్యాడు. మే నెలలో ఎండలు ముదిరితే తాగునీటి సమస్య మరింత జఠిలమయ్యే చాన్స్ ఉంది. భగీరథ పథకంలో లోపాలు ఏర్పడితే వాటిని సత్వరమే పరిష్కరించి నీళ్లు అందించే ప్రయత్నం కూడా చేయడం లేదు.


Next Story

Most Viewed