మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు కన్నుమూత!

by Web Desk |
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు కన్నుమూత!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థకు సీఈఓగా ఉన్న సత్య నాదెళ్ల ఇంట విషాదం నెలకొంది. సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల బాల్యం నుంచి సెరబ్రల్ పాల్సీ(మస్తిష్క పక్షవాతం)తో బాధపడుతూ సోమవారం మరణించాడు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం జైన్ నాదెళ్ల తుదిశ్వాస విడిచినట్టు, ఇలాంటి క్లిష్ట సమయంలో సత్య నాదెళ్ల దంపతులకు ప్రగాఢ సానుభూతి తెలపాలని, వారికి తగిన సమయాన్ని ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ సంస్థ ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఈ-మెయిల్ ద్వారా వెల్లడించింది. తమ కుమారుడు పుట్టినప్పటి నుంచే మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్నాడని మొదటిసారిగా 2017లో సత్య నాదెళ్ల బ్లాగ్ పోస్ట్ ద్వారా బయటి ప్రపంచానికి బహిర్గతం చేశారు. జైన్ పుట్టిన తర్వాత నుంచి తమ జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి అనేక విషయాలను సత్య నాదెళ్ల వివరించారు. 1996, ఆగష్టు 13న జైన్ నాదెళ్ల నెలలు నిండక మునుపే జన్మించాడు. అది కూడా అచేతన స్థితిలో ఉండటంతో ఎంతో వేదనకు గురయ్యామని చెప్పారు. తన కుమారుడి పరిస్థితిని గమనించిన తర్వాత సత్య నాదెళ్ల వైకల్యం ఉన్న వారికి సహాయపడే ఉత్పత్తులను రూపొందించేందుకు కృషి చేశారు. ప్రత్యేక అవసరాలున్న కొడుకుకు తండ్రిని కావడం నా జీవితంలో కీలక మలుపు. ఈ పరిస్థితుల వల్ల వికలాంగుల ప్రయాణాన్ని అర్థం చేసుకునేందుకు సహాయపడిందని సత్య నాదెళ్ల అన్నారు. కాగా, మస్తిష్క పక్షవాతం అంటే మెదడులో నరాలు తీవ్రంగా దెబ్బతినడం వల్ల ఏర్పడే సమస్య. దీని బారిన పడిన చిన్నారుల్లో కొందరు అస్సలు కదలని స్థితిలో ఉంటారు. మరికొందరికి మాటలు వినబడక పోవడం, మాట్లాడలేకపోవడం అనే లక్షణాలు ఉంటాయి. గర్భంలో ఉన్న సమయంలోనే మెదడు అభివృద్ధి నెమ్మదించడం, మెడిసిన్ ప్రభావం ప్రతికూలంగా ఉండటం, నెలలు నిండకుండానే జన్మించడం వంటి కారణాల వల్ల సెరబ్రల్ పాల్సి బారిన పడతారు.



Next Story

Most Viewed