ఇసుక మాఫియాతో ఆ వంతెనకు ప్రమాదం.. పట్టించుకోని అధికారులు

by Dishanational1 |
ఇసుక మాఫియాతో ఆ వంతెనకు ప్రమాదం.. పట్టించుకోని అధికారులు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ సమీపంలోని మానేరు వంతెన మీదుగా సాగుతున్న అక్రమ ఇసుక దందా వల్ల కరీంనగరానికి శోభాయమానంగా నిలువనున్న తీగల వంతెన భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇసుక మాఫియా అల్గునూరు బ్రిడ్జి, తీగల వంతెనకు మధ్యన ఉన్న మానేరు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీని వల్ల తీగల వంతెనపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక దృష్టి సారించి సస్పెన్షన్ బ్రిడ్జి కోసం రూ. 125 కోట్ల వరకూ మంజూరు చేయించారు. గతంలో కరీంనగర్, వరంగల్ రహదారిగా వినియోగించిన ప్రాంతంలో తీగల వంతెన నిర్మాణం జరిపారు. నేడో రేపో ప్రారంభోత్సవానికి సిద్ధం కానున్న ఈ తీగల వంతెనకు ఎగువ ప్రాంతంలో ఇసుక మాఫియా రెచ్చిపోయి అక్రమ రవాణా చేస్తున్నారు. క్రమక్రమంగా ఇసుకను తరలించేవారు వంతెన సమీపంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే నదిలో ఇసుక పెద్ద ఎత్తున తరలిపోవడం వల్ల తీగల వంతెన కోసం వేసిన పిల్లర్లు బలహీన పడే ప్రమాదం ఉంటుందని తెలుస్తోంది. నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుకను తరలించుకపోతున్నందున భవిష్యత్తులో తీగల వంతెనపై తీవ్ర ప్రభావం పడనుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా వంతెన ఎగువ ప్రాంతంలో ఇసుకను తరలిస్తున్నందున భారీ సైజులో గోతులు ఏర్పడుతాయి. ఎగువ ప్రాంతంలో ఉన్న ఎల్ఎండీ గేట్లు ఎత్తినప్పుడు కానీ భారీ వర్షాలు పడినప్పుడు నదిలోకి వచ్చే వరద ఎత్తు పళ్లాల కారణంగా ఉధృతి తీవ్రంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇసుక కోసం తవ్వకాలు జరిపిన ప్రాంతంలో గోతుల్లోకి వరద నీరు వచ్చి చేరినప్పుడు వేగం మరింత పెరుగుతుంటుంది. దీని వల్ల కూడా సస్పెన్షన్ బ్రిడ్జి వంతెన పిల్లర్లపై వరద ఉధృతి తీవ్రంగా పడే అవకాశాలు లేకపోలేదు.

గత అనుభవాలూ..

గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు తీగల వంతెనకు దిగువన నిర్మిస్తున్న చెక్ డ్యాం కొట్టుకోపోయిందంటే వరద ఉధృతి ఎంత తీవ్రంగా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఎగువ ప్రాంతం నుండి వచ్చిన వరద ఎంత వేగంగా వస్తుందో చెక్ డ్యాం కొట్టుకపోయిన విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇసుక మాఫియా చేసే గోతుల వల్ల వరద ఉధృతి మరింత తీవ్రంగా పెరిగినట్టయితే వంతెన భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది. ఇప్పటికైనా అధికారులు ఈ ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాను నిలువరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story

Most Viewed