రాజ్యాంగ వ్యతిరేకి కేసీఆర్: మంద కృష్ణ మాదిగ

by Disha Web Desk 13 |
రాజ్యాంగ వ్యతిరేకి కేసీఆర్: మంద కృష్ణ మాదిగ
X

దిశ, సంగారెడ్డి: భారత రాజ్యాంగ వ్యతిరేకి ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజ్యాంగ పరిరక్షణ వేదిక, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. బుధవారం సంగారెడ్డిలోని తెలంగాణ భవన్‌లో రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి సన్నాహక సదస్సుల నిర్వహించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం అన్న అంబేద్కర్ అన్న కేసీఆర్ గౌరవించడని, దళిత వ్యతిరేకి కేసీఆర్ అని విమర్శించారు.


భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని విషయాన్ని మర్చిపోయి, భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. గాంధీ జయంతి రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ చౌక్ కి వెళ్లి నివాళులు అర్పిస్తారు. కానీ అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ కు ఎలాంటి నివాళులు అర్పించకుండా అవమానం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు.


సమైక్య పాలనలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు.. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అని నామకరణం చేశారని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు అని నామకరణం చేశాడని, అంబేద్కర్ కాళేశ్వరం ప్రాజెక్టు అని ఎందుకు పెట్టలేదని విమర్శించాడు. భారత రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగం పొందుపరిచిందన్నారు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జనాభా 93 శాతం ఉంటే అగ్రవర్ణాల జనాభా రాష్ట్రంలో ఏడు శాతం మాత్రమే ఉందన్నారు.


రాష్ట్ర మంత్రివర్గంలో 93% ఉన్న జనాభాకు కేవలం ఆరుగురు మంత్రులు ఉంటే 7 శాతం ఉన్న వారికి 10 మంది మంత్రులు ఎలా ఉంటారు అని విమర్శించారు. అడుగడుగునా భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పి, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు ఏప్రిల్ 9వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించే రాజ్యాంగ పరిరక్షణ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం, జిల్లా అధ్యక్షుడు తుల్జా రెడ్డి, ఓబిసి ఉద్యోగ సంఘం నాయకులు పాండు, అశోక్ ,కృష్ణ , గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed