14 ఏళ్లుగా ఎయిర్‌పోర్ట్‌లోనే.. భద్రతా సిబ్బంది వెళ్లగొట్టినా..

by Dishanational1 |
14 ఏళ్లుగా ఎయిర్‌పోర్ట్‌లోనే.. భద్రతా సిబ్బంది వెళ్లగొట్టినా..
X

దిశ, ఫీచర్స్: చైనాకు చెందిన 60 ఏళ్ల జియాంగ్‌వో ఇంటితోపాటు భార్యాపిల్లల్ని వదిలేసి 14 ఏళ్లుగా బీజింగ్ విమానాశ్రయంలోనే నివాసముంటున్నాడు. 40 ఏళ్ల వయసులో ఉద్యోగం కోల్పోవడంతో నిరుత్సాహానికి గురైన జియాంగ్‌వో.. ఆ ఒత్తిడిలో మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య ఎన్నోసార్లు వాగ్వాదం జరిగినప్పటికీ తన అలవాట్లను మార్చుకోలేకపోయాడు. దీంతో ఇంట్లో ఉండాలంటే స్మోకింగ్, డ్రింకింగ్ మానేయాల్సిందేనని ఆమె తెగేసి చెప్పింది. అంతేకాదు అతనికి పింఛన్‌గా వచ్చే వెయ్యి యువాన్లను కూడా తమకే ఇవ్వాలని ఆదేశించింది. అయితే తన ఆనందాలను వదులుకునేందుకు ఇష్టపడని జియాంగ్ ఇంట్లో నుంచి పారిపోయాడు.

అక్కడే మకాం

కుటుంబసభ్యులకు దూరంగా బీజింగ్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చేశాడు కానీ, ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. దీంతో ఎయిర్‌పోర్ట్‌లోనే మకాం వేశాడు. తనతో పాటు తెచ్చుకున్న ఎలక్ట్రిక్ కుక్కర్‌‌‌లో వంట చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 14 ఏళ్ల నుంచి విమానాశ్రయంలోనే ఉంటున్నాడు. ఎయిర్‌పోర్ట్ నుంచి పంపించేందుకు అక్కడి భద్రతా సిబ్బంది చాలాసార్లు ప్రయత్నించారు. పోలీసుల సాయంతో అతన్ని ఇంటి వద్ద విడిచిపెట్టినా.. మళ్లీ అక్కడికే వచ్చేవాడు. విమానాశ్రయంలోని ఆధునిక సౌకర్యాలతోపాటు అతనికి అవసరమైన షెల్టర్, బాత్‌రూమ్ ఫెసిలిటీ తదితర సదుపాయాలను విడిచి అక్కడి నుంచి వెళ్లేందుకు ఇష్టపడలేదు. 'ఇంట్లో ఫ్రీడమ్ లేదు. పైగా అక్కడే ఉండాలంటే పింఛన్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అలా చేస్తే మందు, సిగరెట్లను ఎలా కొనుక్కుంటాను' అని జియాంగ్ అంటున్నాడు.

Next Story