ఏకంగా అధికారులే శిలాఫలకంపై సతి స్థానంలో పతి పేరు చెక్కారు..

by Disha Web Desk 13 |
ఏకంగా అధికారులే శిలాఫలకంపై సతి స్థానంలో పతి పేరు చెక్కారు..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రజా ప్రతినిధులుగా గెలిచిన మహిళల స్థానంలో వారి భర్తలు అధికారాలు చెలాయిస్తున్నారన్న ఆరోపణలు చూశాం. కానీ ఇక్కడ మాత్రం అధికారులే స్వయంగా గెలిచిన ప్రతినిధి పేరు కాకుండా ఆమె భర్త పేరును శిలాఫలకంపై చెక్కించి సరికొత్త రికార్డు సృష్టించారు. అధికార పార్టీ నాయకులు అయినంత మాత్రాన ప్రోటోకాల్ కు విరుద్ధంగా, ఏకంగా ఓ కార్పొరేటర్ భర్తనే ప్రజా ప్రతినిధిగా చూపిస్తూ.. శిలాఫలకంపై పేరు చెక్కించడం విమర్శలకు దారి తీస్తోంది.

బాబు జగ్జీవన్ రాం సాక్షిగా..


స్వర్గీయ బాబు జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా కరీంనగర్ లో అధికారికంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్ సమీపంలోని విజయపురి కాలనీలో జగ్జీవన్ రాం విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించిన ఈ విగ్రహం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకం లో పేర్లు చెక్కించే విషయంలో అధికారులు నిబంధనలను గాలికొదిలారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెల్చిన కార్పొరేటర్ పేరు కాకుండా ఆమె భర్త పేరు శిలాఫలకం లో చేర్చడం విమర్శలకు దారి తీస్తోంది. వాస్తవంగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ నుండి సుధగోని మాధవి గెలిచారు. అధికారికంగా కూడా ఆమె పేరే రికార్డుల్లోనూ ఉంది. కానీ ఇక్కడ మాత్రం అధికారులు తప్పులో కాలేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మహిళా కార్పొరేటర్ పేరును కాదని.. ఆమె భర్త సుధగోని కృష్ణ పేరును శిలాఫలకం లో చెక్కించడం విమర్శలకు దారి తీస్తోంది.

యంత్రాంగం ఫెయిల్యూరేనా..?

ప్రోటోకాల్ ను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ విభాగం కూడా ఉంటుంది. ఈ డిపార్ట్ మెంట్ లో ఎవరి పేర్లు పెట్టాలి, క్రమ పద్దతిలో ఎలా ఉండాలి అనే నిబంధనలు కూడా ఉంటాయి. అధికారికంగా పేర్లు రాసేప్పుడు వారు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న పేర్లను మాత్రమే రాయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ప్రజా ప్రతినిధి పేరునే మార్చి భార్య స్థానంలో భర్త పేరును చెక్కించడం విస్మయం కలిగిస్తోంది. నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోకుండా, ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కాని వ్యక్తి పేరును శిలాఫలకంలో చేర్చడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరో వైపున ఇదే శిలాఫలకం లో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి పేరుతో పాటు ఆమె భర్త హరిశంకర్ పేరును కూడా జోడించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి పేరు మాత్రమే రాయాల్సి ఉన్నప్పటికీ ఆమె భర్త పేరును జోడించడం కూడా నిభందనలకు విరుద్దమేనని అంటున్న వారూ లేకపోలేదు. ఏది ఏమైనా కరీంనగర్ అధికారులు మాత్రం సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారన్న వ్యంగోక్తులు వినిపిస్తున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed