ఆ విషయంలో పోలీసులు బెదిరించారని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

by Web Desk |
ఆ విషయంలో పోలీసులు బెదిరించారని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
X

దిశ, బెల్లంపల్లి: భూ వివాదంలో పోలీసులు బెదిరింపులకు పాల్పడడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం నిన్నెల మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. నెన్నెల మండలం చిన్న లంబాడి తండ గ్రామానికి చెందిన ధరావత్ బాలు నాయక్ అనే వ్యక్తి తన పాత ఇంటి స్థలంలో ఏడాది నుంచి కొత్త ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు. ఇంటి నిర్మాణం చేపట్టిన స్థలంపై అదే గ్రామానికి చెందిన కొందరు అభ్యంతరం తెలిపి డయల్ 100 కు ఫోన్ చేశారు. దీంతో స్పందించిన నెన్నెల పోలీసులు బాలు నాయక్ ను రెండు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు.

నిర్మాణం చేపట్టిన స్థలం మీది కాదని, అభ్యంతరం చేస్తున్న వ్యక్తులతో మాట్లాడుకోవాలని సూచించారు. ఏడాది కాలం నుంచి ఇంటి నిర్మాణం చేస్తున్నామని, ఆ స్థలం తమదేనని అం దుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, గ్రామపంచాయతీ తీర్మానం ప్రతిని పోలీసులకు బాలు నాయక్ చూపించాడు. అయినా పోలీసులు అదేమీ లెక్కచేయకుండా వేధింపులకు గురి చేశారు. దీంతో మనస్తాపం చెందిన బాలునాయక్ ఆదివారం తన ఇంటి వద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

వెంటనే కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలు నాయక్ ను మంచిర్యాలకు తీసుకెళ్లారు. ప్రస్తుతం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో బాలునాయక్ చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. భూ వివాదంలో పోలీసులు తల దూర్చి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడేలా వేధించడం విమర్శలకు దారి తీసింది.



Next Story

Most Viewed