క్రూడ్ ధర బ్యారెల్‌కు 40 డాలర్లు తగ్గితేనే విండ్‌ఫాల్ సుంకం తొలగింపు: తరుణ్ బజాజ్!

by Disha Web Desk |
క్రూడ్ ధర బ్యారెల్‌కు 40 డాలర్లు తగ్గితేనే విండ్‌ఫాల్ సుంకం తొలగింపు: తరుణ్ బజాజ్!
X

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ప్రస్తుతం ఉన్న ధరల కంటే బ్యారెల్‌కు 40 డాలర్లు తగ్గితేనే ఇటీవల కేంద్రం విధించిన విండ్‌ఫాల్ సుంకాన్ని ఉపసంహరించుకుంటుందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. గతవారం కేంద్రం ప్రభుత్వం దేశీయ చమురు సంస్థలు, రిఫైనరీల కోసం విండ్‌ఫాల్ సుంకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దేశీయ సరఫరా, ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా చమురు సంస్థలు విదేశాలకు ఎగుమతి ద్వారా ఎక్కువ లాభాలను పొందుతున్న నేపథ్యంలో జూలై 1 నుంచి ఈ పన్నును అమలులోకి తెచ్చారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పన్నులను సమీక్షించనున్నారు. ఇది అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటుంది. అక్కడ ముడి చమురు ధరలు తగ్గిస్తే ఇక్కడ విండ్‌ఫాల్ లాభాలు నెమ్మదిస్తాయని, అనంతరం దీన్ని తీసేయడం జరుగుతుందని తరుణ్ బజాజ్ వివరించారు. ఇప్పుడున్న ధరల స్థాయి నుంచి 40 డాలర్లు తగ్గిస్తే కేంద్రం విండ్‌ఫాల్ సుంకాన్ని తొలగించే యోచనలో ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఒపెక్ దేశాల చమురు ఉత్పత్తి తక్కువగా ఉండటం, రష్యాపై కొనసాగుతున్న ఆంక్షల కారణంగా సరఫరా దెబ్బతినడం, ప్రపంచ మాంద్యం భయాల మధ్య బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 111.27 డాలర్లకు చేరుకుంది.

Next Story

Most Viewed