సలసల మంటున్న వంటనూనె ధరలు

by Dishanational2 |
సలసల మంటున్న వంటనూనె ధరలు
X

దిశ, కాటారం : ప్రజల జీవన విధానంలో భాగమైన నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా వినియోగించే నూనె ధరల్లో భారీగా పెరుగుదల వచ్చింది. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన రెండు మూడు రోజుల తర్వాత నుంచి వంటనూనెల ధరలు భారీగా పెరుగుతున్నాయి. యుద్ధం ప్రారంభానికి ముందు ఉన్న ధరలతో ఇప్పుడు ఉన్న ధరలను పోల్చితే 20 శాతం పైగా ధరలు పెరిగాయి. ఇప్పుడు షేర్ మార్కెట్ తలపిస్తున్న వంటనూనెల ధరలు ఏ రోజుకారోజు మారిపోతున్నాయి. నూనె ధరలు పెరుగుతుండటంతో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా వంటనూనెల దిగుమతులు నిలిచిపోవడంతో మార్కెట్లో వంట నూనెల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. కారణంగా హోల్ సేల్ రిటైల్ వ్యాపారస్తులు ధరలను రోజురోజుకూ పెంచుతూనే ఉన్నారు. వంటనూనె ధరల పెరుగుదల ఆహార పదార్థాల తయారీ పై తీవ్ర ప్రభావం చూపుతోంది.

కృత్రిమ కొరత

వంటనూనెల వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టిస్తూ తద్వారా ధరలు ఏ రోజు కారోజు పెంచుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధాన్ని బూచిగా చూపిస్తూ డిస్ట్రిబ్యూటర్లు ఆడిందే ఆటగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. పది రోజుల క్రితం సన్ఫ్లవర్ (900ml ) రూ.140, వేరుశనగ రు.155,పామాయిల్ రూ.130, ఇపుడు సన్ఫ్లవర్ రూ.192, వేరుశెనగ నూనె రూ.180, పామాయిల్ రూ.150 మార్కెట్లో ధరలు ఉన్నాయి. వంటనూనెల దిగుమతులు షాపులపై ప్రభుత్వ శాఖల నియంత్రణ లేకపోవడంతో హోల్ సేల్ వ్యాపారస్తుల విక్రయాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని పలువురు ఆరోపిస్తున్నారు.

భారీగా పెరిగిన మిర్చి, ధనియాలు ధరలు

నిత్యావసర సరుకుల ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఒక్కసారిగా మిర్చి ధరలు భగభగ మంటున్నాయి. పది రోజుల క్రితం మిర్చి కారం పొడి కిలో ధర రూ 140 ఉండగా ప్రస్తుతం మిర్చి కారం పొడి పెరిగిన ధర 260 రూపాయలకు, ధనియాలు కిలో ధర రూ. 80 కాగా,ఇప్పుడు 130 కి చేరింది. ఒకసారి గా 40 శాతం పెరిగిన ధరలతో ప్రజలు విలవిలలాడిన పోతున్నారు. గోధుమపిండి, ఉప్మా రవ్వ 20 శాతం మేరకు ధరలు పెరిగాయి. నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరుగడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.



Next Story

Most Viewed