కోరుట్లలో అధికార బలంతో అక్రమ ఇసుక దందా.. రహస్య ప్రాంతాల్లో ఇసుక డంపులు

by Disha Web Desk 12 |
కోరుట్లలో అధికార బలంతో అక్రమ ఇసుక దందా.. రహస్య ప్రాంతాల్లో ఇసుక డంపులు
X

దిశ, కోరుట్ల : అధికార, అంగ బలం ఉంటే చాలు ఎలాంటి ఆక్రమాలైన చేయొచ్చన్న ధీమా పెరిగిపోయిందక్కడ. ఇదే అదనుగా భావించిన కొంతమంది అక్రమార్కులు సహజ వనరులను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జగిత్యాల జిల్లాలో ఇష్టారాజ్యంగా నడుస్తున్న అక్రమ ఇసుక దందానే ఇందుకు ప్రధాన సాక్ష్యం అంటున్నారు స్థానికులు. జిల్లాలోని కోరుట్లలో అధికార బలంతో కొందరు ప్రజా ప్రతినిధులతో చేతులు కలిపిన ఇతర పార్టీల నాయకులు అక్రమ వ్యాపారానికి తెరలేపారన్న ఆరోపణలు వస్తున్నాయి.

అక్రమ ఇసుక దందా సాగిస్తున్న వారిని అడ్డుకోవాల్సిన అధికార యంత్రంగం చోద్యం చూస్తుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. కోరుట్ల పట్టణంతో పాటు మండలం లో కొందరు ప్రజాప్రతినిధులు అధికార బలంతో ట్రాక్టర్ల ద్వారా స్థానిక వాగుల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తూ అడ్డగోలుగా డబ్బులు దండుకుంటున్నారు. రాత్రి వేళ్లల్లో జోరుగా ఇసుకను తరలిస్తూ.. రహస్య ప్రాంతాల్లో డంపులు ఏర్పాటు చేస్తూ నిర్మాణాలు చేపట్టే ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము గడిస్తున్నారు.పెద్ద ఎత్తున ఇసుకను వాగుల నుంచి జేసీబీ ల ద్వారా తవ్వకాలు జరిపి ట్రాక్టర్‌లలో తరలించడంతో ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పాటు వాగులో బావులు తయారయ్యాయి.

ఇసుక తవ్వకాలతో వాగులు ప్రమాదకరంగా తయారు చేస్తున్నారు. సహజ వనరులను కాపాడాల్సిన వారే అక్రమ వ్యాపారం కొనసాగించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియం రకం ఇసుకకు ఒక్క ట్రిప్పు సుమారు రూ. 2 వేలు‌, సన్న రకం ఇసుకకు ట్రిప్పుకు రూ. 3500 వసూలు చేస్తూ అక్రమార్జన కొనసాగిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా అక్రమ వ్యాపారం చేసే వారిపై కొరడా ఝాలిపించాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.

Next Story

Most Viewed